Maoist Leader RK Dead: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో చనిపోయినట్లు తెలుస్తోంది.
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్నప్పుడు ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. ఆయన రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఆర్కే మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తుమ్రుకోటకు చెందిన ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. ఆర్కే తండ్రి టీచర్ గా పనిచేసేవారు. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే ఆమె ఆ తర్వాత బయటకు వచ్చి టీచర్ గా పనిచేశారు. ఆమెపై కూడా పలు కేసులు ఉన్నాయి.
2003లో తిరుమల శ్రీవారి బ్రహ్మోహత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన నక్సల్స్ దాడిలో ప్రధాన సూత్రధారి ఆర్కే అని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక దాడుల్లో ఆర్కే కీలకపాత్ర పోషించారు. ఆయనపై దాదాపు రూ.50 లక్షలకు పైగా రివార్డు వుంది.
ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ కాగా.. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తన పేరును ఆర్కేగా మార్చుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే తలదాచుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్కే మరణించినట్లుగా పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం. ఆర్కే కుమారుడు మున్నా కూడా 2016లోనే పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై మొత్తం 85 కేసులున్నాయి. 2004లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో ఆర్కే చర్చలు జరిపి నేటికి 17 సంవత్సరాలు అవుతున్నాయి.