Janasena Joinings: జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలోకి ఆహ్వానించిన పవన్
Janasena Joinings: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేన కండువా కప్పుకున్నారు.
![Janasena Joinings: జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలోకి ఆహ్వానించిన పవన్ Mangalagiri two ex Mlas joins Janasena in presence of Party chief Pawan Kalyan Janasena Joinings: జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీలోకి ఆహ్వానించిన పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/12/faee7de2482eb731d6690abd2f991d661678619180978235_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Janasena Joinings: జనసేన పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేనలో చేరారు. వీరితో పాటు భీమిలి వైసీపీ నేతలు దివాకర్, శ్రీచంద్ర రావు తదితరులు జనసేన కండువా కప్పుకున్నారు.
జనసేనలోకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019ల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల టైంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతకాలం వేచిచూసిన పార్టీలో తగిన గుర్తుంపు లభించడంలేదంటూ ఇటీవల ఆయన వైసీపీ రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో తానేటి వనితను గెలిపిస్తే పదవి ఇస్తానని సీఎం జగన్ అప్పట్లో చెప్పారని, కానీ ఆ తర్వాత పట్టించుకోలేదని రామారావు చెప్పుకొచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయలేకపోవడంతో బాధకలిగి వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు తెలిపారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరారు. ఆయన 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత 2014లో జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈదర హరిబాబు, తాజాగా జనసేనలో చేరారు.
వైసీపీకి రాజీనామా
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేశారు. 2009లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అనంతరం వైసీపీలో చేరారు. అయితే తనకు పార్టీలో అంత ప్రాధాన్యత లేదని టీవీ రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలులో జరిగిన ఓ కేసులో ఇరుక్కోవడంతో రాజకీయంగా ఆయనకు దెబ్బ తగిలింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయనకు 2014లో టీడీపీ నుంచి టికెట్ రాలేదు. అయినా కేఎస్ జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతుగా పాటు పడ్డారు టీవీ రామారావు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ వైసీపీలో చేరారు. 2019లో జగన్ సమక్షంలో ఫ్యాన్ గుర్తు పార్టీ వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా ప్రచారం చేసి ఆమె విజయంలో కీలకపాత్ర పోషించారు. అయితే పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీకి గుడ్ బై చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని రోజులు తనకు మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పరంగా తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. తానేటి వనితకు మద్దతుగా పనిచేశానని చెప్పారు. కానీ పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనకు పదవి ఇచ్చి గౌరవించాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పదవి సైతం తనకు ఏవీ ఇవ్వలేదు. అంటే పార్టీకి తనకు అవసరం లేదా, లేక పార్టీలో తనకు ప్రాధాన్యత లేదా అని భావించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.తాజాగా ఆయన జనసేనలో చేరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)