Manchu Manoj: తిరుపతికి మారిన మంచు ఫ్యామిలీ డ్రామా - నారా వారి పల్లెలో లోకేష్‌ను కలిసిన మనోజ్ - ఎంబీయూకి వెళ్లొద్దని పోలీసుల నోటీసులు !
Manchu family: మంచు ఫ్యామిలీలో వివాదం కొత్తగా మోహన్ బాబు యూనివర్శిటీకి చేరింది. రంగంపేట జల్లికట్టును చూసేందుకు మనోజ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. నారా వారి పల్లెలో లోకేష్‌ను కలిశారు.
Manchu family Dispute: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకుంది. సంక్రాంతి సంబరాలను ఎంబీ యూనివర్శిటీ క్యాంపస్ లో చేసుకుంటున్నారు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. మంచు మనోజ్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. కనుమ సందర్భంగా రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పోటీలను చూసేందుకు మంచు మనోజ్ హైదరాబాద్ నుంచి సతీమణితో వచ్చారు. మోహన్ బాబు స్వగ్రామం రంగంపేట. మనోజ్ వస్తున్నందున.. పెద్ద ఎత్తున రంగంపేట నుంచి ఆయన స్నేహితులు వచ్చి స్వాగతం పలికారు.
రంగం పేట నుంచి మనోజ్ నేరుగా మోహన్ బాబు వర్శిటీకి వెళ్తారన్న ప్రచారం జరిగింది.దీంతో ఎంబీయూకు చెందిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మనోజ్ యూనివర్శిటీలోకి వస్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని రాకుండా చూడాలని కోరారు. దీంతో పోలీసులు మనోజ్ కు నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబు వర్శిటీలోకి వెళ్లేందుకు శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని చెప్పారు. కారులోఉండి నోటీసులు తీసుకున్న మనోజ్.. కనీసం ఆ నోటీసుల్ని చూడకుండా పక్కన పెట్టుకుని ముందుకు వెళ్లిపోయారు.
ముందుగా ఆయన నారా వారి పల్లె వెళ్లారు. సంక్రాంతి సంబరాల కోసం నారా వారి పల్లెకు వెళ్లిన లోకేష్..అక్కడే ఉన్నారు.కనుమ పండుగ కావడంతో కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. అక్కడ మనోజ్, మౌనిక దంపతులు నారా లోకేష్‌తో చర్చించారు.ఆ చర్చల సారాంశం ఏమిటో స్పష్టత లేదు. అయితే ఎంబీయూలోకి వెళ్తే..గతంలో ఇంటి దగ్గర ఏర్పడిన తరహా పరిస్థితులు ఎదురవుతాయన్న అంచనాలకు పోలీసులు రావడంతో ఆయనను లోపలకు వెళ్లనిచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. భూమా మౌనిక.. టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరి . అయినా వారిక పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఎలాంటి వివాదాలు జరగకుండా చూడాలని అనుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది.
మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదంలో ఎంబీ యూనివర్శిటీ అంశం కూడా ఉంది. యూనివర్శిటీలో అక్రమాలు జరుగుతున్నాయని.. ఆ యూనివర్శిటీ వ్యవహారాలను చూస్తున్న వినయ్ మహేశ్వరిపై మనోజ్ ఆరోపణలు చేశారు. అయితే వినయ్ చాలా మంచి వ్యక్తి అని మోహన్ బాబు సర్టిపికెట్ ఇచ్చారు. మరో వైపు .. మోహన్ బాబు , మంచు విష్ణు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి దిగిన ఫోటోలతో ఊరంతా ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఎంబీయూని వివాదాదల్లోకి రాకుండా..మనోజ్ వచ్చి గలాటా చేయకుండా పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు.
పోలీసులు ముందు జాగ్రత్తగా ఎంబీ యూనివర్శిటీ వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఎవరినీ కాలేజీలోకి అనుమించడంలేదు. మనోజ్ వస్తారన్న సమాచారం ఉండటంతో మీడియా పెద్ద ఎత్తున అక్కడకు చేరింది. అయితే మోహన్ బాబు వర్శిటీ ప్రతినిధులు మీడియాను కూడా అక్కడి నుంచి దూరంగా పంపేశారు. యూనివర్శిటీలోనే మోహన్ బాబు, విష్ణు ఉన్నారు.