Pawan Kalyan : వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుంది, జనసేనకు అధికారం అప్పగిస్తే ఒక కూలీగా పనిచేస్తా - పవన్ కల్యాణ్
Pawan Kalyan : కులాల ఐక్యతే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. దెబ్బల తగిలేకొద్ది జనసేన బలపడుతుందని అన్నారు. ఎప్పటికైనా జనసేన ప్రభుత్వం ఏర్పాటుచేస్తామన్నారు.
Pawan Kalyan : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పదో వార్షిక ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విజయవాడ నుంచి వారాహి వాహనంలో భారీ ర్యాలీగా బయలుదేరి మచిలీపట్నం చేరుకున్నారు. ఈ సభలో 47 కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు పవన్ కల్యాణ్. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... 2014 మార్చి 14న పార్టీ పెట్టినప్పుడు నేను, నాతో పాటు కొద్ది మంది మాత్రమే ఉన్నారన్నారు. నా ఇంట్లో రాజకీయ నేతలు ఎవరూలేరన్నారు. ఓ చిన్న ప్రస్థానం మొదలైనా అది ఏమైందో మీకు తెలుసన్నారు. సగటు మనిషి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను.
నా ప్రాణాలు పోయినా పర్లేదు
"జనసేన పార్టీ పెట్టడానికి స్వాతంత్ర్య పోరాట యోధులే స్ఫూర్తి. మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకన్న తన చివరి దశలో ఆకలికి అలమటించారని చదివి ఆవేదన చెందాను. ఇలాంటి ఎంతో మంది స్ఫూర్తితో పార్టీ పెట్టాను. రుద్రవీణలో ఓ పాటలోని పంక్తులే నాకు స్ఫూర్తి. ఇవాళ ఇంత మంది అభిమానం సంపాధించానంటే ఇంత కన్నా ఏంకావాలనుకున్నాను. కేవలం అసమానతలు, దోపిడీ విధానాలుపై పోరాటానికి , అగ్రకులాల్లో పేదలకు అండగా ఉండేందుకు పార్టీ పెట్టాం. రెండు చోట్ల ఓడిపోయినా, ఎన్నో అవమానాలు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను. నా ప్రాణాలు పోయినా పర్లేదు సమాజానికి ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి దూకేశాను. ఇంత మంది నాకు అండగా నిలబడ్డారు. ఎవరైనా గెలిచేకొద్ది బలపడతారు. కానీ జనసేనను దెబ్బ కొడుతుంటే బలపడుతుంది. పులవెందులతో సహా తెలుగు రాష్ట్రాల్లో 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులను సంపాదించుకున్నాం. తెలంగాణలో 30 వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు" - పవన్ కల్యాణ్
జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం
"ఈ పదేళ్లలో ఓటములు ఎదుర్కొన్నాం. ఎప్పటికీ జనాలకు అండగా ఉంటాం. వారి ఆశీస్సులో ఒకరోజున జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జనసేన స్థాపించేటప్పుడు ఏడు సిద్ధాంతాలను ప్రతిపాదించుకున్నాం. వాటి కోసం పోరాడుతున్నాం. జనంలో పరివర్తన రావాలంటే చాలా కష్టపడాలి. కులాలను కలిపే ఆలోచన విధానంరావాలి. సమాజంలో అన్ని కులాలు కలిసి ఉంటేనే అభివృద్ధి. కులాలపై మాట్లాడేందుకు చచ్చిపోయేవాడిని. కులాల ఐక్యత చాలా అవసరమని భావిస్తున్నాను. నేను కాపుల్లో పుట్టాను. కానీ అన్ని కులాలకు అండగా ఉండాలనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. కులాలను విడదీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది." - పవన్ కల్యాణ్
అగ్రకులాల్లో ఉన్న పేద యువతకు అండగా ఉంటాం
"నేను ఎక్కడికి వెళ్లినా మార్పు కావాలని కోరుతున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్లినా రిజర్వేషన్లు కావాలంటున్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలు సంఖ్యా బలం ఉన్నా దేహీ అని పరిస్థితి మారాలి. అగ్రకులాల్లో ఉన్న పేద యువతకు అండగా ఉంటాం. మీకు స్కాలర్ షిప్స్ అందిస్తాం. ఈ మంత్రులు కోట్లు దోచుకుంటున్నారు. ఒక ఎన్నికలకు రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిరుద్యోగులకు రూ.10 నుంచి రూ.15 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. మొన్న సీఎం కేసీఆర్ నాకు రూ.1000 కోట్లు ఇచ్చారని తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను. నాకు డబ్బులు అవసరంలేదు. నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాకి రోజుకు రూ.2 కోట్లు ఇస్తారు. నేను చూడని డబ్బులా. అన్ని కులాల్లోని యువతకు ఒకటే చెబుతున్నాను. మాకు ఏంచేశారో అని మీ కుల నాయకుల్ని ప్రశ్నించండి. అధికారం జనసేనకు అప్పగిస్తే ఒక కూలీగా పనిచేస్తాను. టీడీపీని అందలం ఎక్కించేందుకు ఉన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు." - పవన్ కల్యాణ్