Rains In AP Telangana: రెండు రోజుల్లో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే వర్షాలు
Rains In AP Telangana: వాయుగుండం ఉత్తర భారతదేశం వైపుగా కదులుతోంది. సెప్టెంబర్ 18 నుంచి మరో అల్పపీడనం ప్రభావం రాష్ట్రం పై మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
Light to Moderate Rains In Andhra Pradesh Telangana today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తగ్గింది. వాయుగుండం ఉత్తర భారతదేశం వైపుగా కదులుతోంది. కనుక ఏపీ, తెలంగాణలో రెండు రోజులు వర్షాలు తక్కువగా ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఏపీ, యానాంలలో నేడు మోస్తరు వర్షాలు కురవనుండగా.. తెలంగాణలలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే వర్షాల ప్రభావం తగ్గడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సెప్టెంబర్ 18 నుంచి మరో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో వర్షాలు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వారం రోజుల తరువాత తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22, గరిష్ట ఉష్ణోగ్రత 30గా నమోదైంది. నైరుతి దిశ నుంచి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రి, ఉదయం వేళ చలి అధికంగా ఉంటే, మధ్యాహ్నానికి వాతావరణం వేడెక్కుతోంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 15, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు పడతాయి. సెప్టెంబర్ 18 నుంచి మరో అల్పపీడనం ప్రభావం రాష్ట్రం పై మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. గత రెండు సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది కనిపిస్తోంది. జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాలను చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైపు అత్యధిక వర్షపాతం 1011 మిల్లీమీటర్లు నమోదయ్యింది.
— MC Amaravati (@AmaravatiMc) September 15, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలల్లో ఉన్నంత వర్షపాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నమోదు కాదు. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి మంచి వర్షాలే పడ్డాయి. కాకినాడలో 912 మిల్లీమీటర్లు, విజయనగరంలో 871 మిల్లీమీటర్లు, తిరుపతిలో 835 మిల్లీమీటర్లు వర్షపాతం ఇప్పటివరకు నమోదయ్యింది. మరోవైపు మధ్య ఆంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది మొదటి స్ధానంలో నిలిచిన కడప నగరం మాత్రం ప్రస్తుతం చివరి స్ధానంలో నిలుస్తోంది. దక్షిణ కోస్తాంధ్రలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలుంటాయి. అన్నమయ్య జిల్లా, చిత్తురు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి.