YS Jagan: ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌ను ముద్దాయిలుగా చేర్చాలి, మేం హైకోర్టుకు వెళ్తాం - జగన్
Jagan News: ‘హంతకులే కాదు.. హత్య చేయించిన వారినీ వదలొద్దు.. వారికి మద్దతు ఇస్తున్న లోకేష్, చంద్రబాబునూ ముద్దాయిలుగా చేర్చాలి. అప్పుడు కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు’అని జగన్ అన్నారు.
YS Jagan Comments: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. గత శనివారం రాత్రి గ్రామంలో సుబ్బారాయుడు ఇంటిపై దాడి చేసిన దుండగులు.. ఆయనను కత్తులతో పొడిచి, కర్రలు, రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్పు ఇచ్చిన వైయస్ జగన్ అక్కడే సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన, రావణకాష్టంలా హింసాకాండ కొనసాగుతోందని.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా, అది చేయించిన వారినీ ముద్దాయిలుగా చేర్చి, జైలుకు పంపిస్తేనే పరిస్థితి మారుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా వాటికి మద్దతు ఇస్తున్న నారాలోకేష్, చంద్రబాబును కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదని స్పష్టం చేశారు.
రెండు నెలలుగా మారణహోమం
రాష్ట్రంలో గత రెండు నెలలుగా పాలన ఎలా ఉందంటే.. ప్రజలకు మంచి చేయాలని, ఎన్నికల వేళ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేస్తూ, అలా ప్రజల మనసులో స్థానం కల్పించుకోవాలన్న ఆలోచన లేని ప్రభుత్వం కనిపిస్తోంది. రెండు నెలలుగా అరాచకం కొనసాగుతోంది. మారణహోమం సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల వేళ ఎన్నో మాటలు చెప్పారు. ప్రజలకు మోసం చేస్తూ, ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రజలంతా ప్రశ్నిస్తారన్న భయంతో, వారు ప్రశ్నించకూడదన్న ఆలోచనతో ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రవ్యాప్తంగా సృష్టిస్తున్నారు.
రెడ్‌బుక్ పాలన
అందరినీ మోసం చేసిన చంద్రబాబు, దాన్ని ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్‌బుక్ తెరిచి, కక్ష సాధింపు చర్యలు వాళ్లు చేస్తుంటే.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామస్థాయిలో గ్రామ నాయకులు ఎవరికి వారు, రెడ్‌బుక్ తెరిచి.. ఊళ్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నాం.
హైకోర్టును ఆశ్రయిస్తాం
ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి, కాల్ రికార్డ్ చూస్తే.. హత్యకు ముందు, ఆ తర్వాత ఎవరెవరికి ఫోన్ చేశాడో చూసి, వారిని బొక్కలో పెడితే, అన్నీ చక్కబడతాయి కదా?. కానీ ఎందుకు పెట్టలేకపోతున్నారు? కేసులు వారి దాకా ఎందుకు పోనివ్వడం లేదు? రాష్ట్రంలో అంతటా ఇదే పరిస్థితి. వినుకొండలోనూ జరిగింది. ఈ ఘటనను కచ్చితంగా హైకోర్టులో వేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. గ్రామంలో ఏజెంట్లుగా కూర్చున్న వారందరికీ పోలీసులతో భద్రత కల్పించడం కోసం కోర్టుల ద్వారా ప్రయత్నిస్తాం. ఉత్తర్వులు వచ్చేలా చూస్తాం’’ అని వైఎస్ జగన్ అన్నారు.