MP Avinash Reddy: నేనేంటో అందరికీ తెలుసు, రెండున్నరేళ్ల నుంచి నన్ను డీఫేమ్ చేస్తున్నారు - అవినాష్ రెడ్డి
గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణకు రావాలని నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఈ సీబీఐ నోటీసులపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తన గురించి, తన వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలు అందరికీ బాగా తెలుసని అన్నారు. ‘‘న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలి అన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని నేను కూడా భగవంతుడిని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి’’ అని అన్నారు.
నిన్న (జనవరి 23) మధ్యాహ్నం సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి సీబీఐ నోటీసులు ఇచ్చారు. నేడు (జనవరి 24) మధ్యాహ్నం సీబీఐ విచారణకు రావాలని ఆదేశించారు. కానీ, ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు నాలుగైదు రోజులు గడువు కావాలని సమయం కోరాను. మళ్లీ వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా విపరీతంగా నాకు, నా కుటుంబానికి పరువు నష్టం కలిగింది. ఇంకా కోర్టులో విచారణ మొదలు కాకపోయినా ఒక సెక్షన్ మీడియా నన్ను విపరీతంగా డీఫేమ్ చేసింది. నన్ను నా వాళ్లను విపరీతంగా బాధపెట్టారు. కానీ, నేను ఏమీ మాట్లాడలేదు. ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడాలంటేనే నా మనస్సు ఒప్పుకోవడం లేదు. నేను ఏంటో నా వ్యక్తిత్వం ఏంటో ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసు. న్యాయం గెలవాలి, నిజం ఏంటో బయటకు రావాలి. నిజం బయటకు రావాలని అందరూ దేవుణ్ని కోరుకోండి. మీడియాకు కూడా ఇదే చెప్తున్నా. అంతేకానీ, సొంత వ్యాఖ్యానాలు రాయొద్దని కోరుతున్నా.’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.