కర్రల సమరం కాదు- కర్రల సంస్కృతి అంటున్న దేవరగట్టు ప్రజలు
ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో ఆచారాలవాట్లు ఉంటాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో ఉన్నా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవం ప్రత్యేక వింత ఆచారం నేటికి కొనసాగిస్తున్నారు.
కర్నూలు జిల్లా మండలం దేవరగట్టులో నేటికీ వింతా ఆచారం కొనసాగిస్తున్నారు. దసరా ఉత్సవాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ముందుగా గుర్తొచ్చే కర్రల సమరం... దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఎంతో ఆసక్తికరంగా సాగే దేవరగట్టు ఉత్సవాలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అర్ధరాత్రి జరిగే బన్నీ(కర్రల సమరం) నియంత్రణకై పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రతి ఏటా సంప్రదాయంగా జరిగే బన్నీ ఉత్సవం ఈసారి ఎలా జరుగుతాయో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం నుంచి ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టిన గతంలో కేంద్ర బలగాలను సైతం భద్రతగా పెట్టిన కర్రల సమరం అదుపు చేయలేక ఆ ఉత్సవాన్ని నేటికీ అలానే కొనసాగిస్తున్నారు. వేలమంది పోలీస్ యంత్రాంగం ఉన్న ఆరోజు రాత్రి జరిగే సమరంలో ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి. మరుసటి రోజు ఉదయం స్వామివారిని తిరిగి గుడికి చేర్చేంతవరకు పోలీసులు ఎక్కడ ఎంటర్ అయిన సందర్భాలు ఉండవు.
భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సాంప్రదాయమైనటువంటి ఆచారాలవాట్లు ఉంటాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలంలో ఉన్నా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవం ప్రత్యేక వింత ఆచారం నేటికి కొనసాగిస్తున్నారు. ఆ ఆచారం చూసే వాళ్లకు అది యుద్ధమే.. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం తలపించే వింతైన శబ్దాలతో దేవరకొట్టు ప్రాంతమంతా అలుముకుంటాయి.
అక్కడ అదొక ఆచారం.. దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ క్రీడ కానీ అక్కడ జరిగే సీన్లు చూస్తే దడ పుట్టాల్సిందే. అదే దేవరగట్టు కర్రల యుద్ధం. కళ్లలో భక్తి, కర్రలో పౌరుషం. టెంకాయల్లా తలల్ని పగులగొట్టే ఆచారం. కర్నూలుజిల్లా హోలగుంద మండలంలోని దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి యేటా జరిగే సీన్ ఇది. ఈ ఏడాది కూడా కర్రల సమరానికి సై అంటూ కాలు దువ్వుతున్నారు. అర్థరాత్రి దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగనుంది. ఈ దేవరగట్టు కర్రల సమరం ఉత్కంఠ రేపుతోంది. ప్రతి ఏటా జరిగే హింస ఈసారి కూడా జరుగుతుందా అనేదానిపై స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి.
పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు, తపస్సులు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మని..మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ పూజలకు భంగం కలిగిస్తుండేవారట. వారి వికృత చేష్టలు భరించలేక రుషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారని ఇక్కడి వారి విశ్వాసం. రక్షణ విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచనతో మునులంతా విష్ణుని వేడుకున్నారు. ఆయన పరమేశ్వరుడివైపు చూశారట. అలా పరమేశ్వరుడు కాల భైరవుడి అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగించాడని భక్తుల విశ్వాసం.
మని అనే రాక్షసుడు ప్రాణాలు విడిచే సమయంలో తన చివరి కోరికను తీర్చాలని వేడుకున్నాడట. ఉత్సవాలకు వచ్చే కొందరి భక్తులను ఆహారంగా బలి ఇవ్వాలని కోరాడని స్థానికులు చెబుతున్నారు. దానికి పరమ శివుడు అంగీకరించి తథాస్తు అని చెప్పే సమయంలో పార్వతి దేవి అడ్డు చెప్పిందట. బలి ఇవ్వడం కుదరదని వేరే వరం కోరుకోవాలని కోరింది. భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలన్న కోరికను అంగీకరించిందట. అందుకే ఏటా దేవరగట్టు ఉత్సవాల్లో భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా వరం ఇవ్వడంతో రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చెప్తారు.
ఆ పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గొరవయ్యలు అడ్డుకునే ప్రయాత్నం చేయడంతో భక్తులు మాళమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి పూజారి దబ్బనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే బండారు పూసి డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ బన్నీ జైత్ర యాత్రలో జరిగే కర్రల సమరంలో కర్రలతో కొట్టుకుంటారు. యుద్ధం జరిగే సమయంలో వెళ్తున్న పరమేశ్వరుడికి ముళ్ళు గుచ్చుకొని ముళ్ల బండ సేద దీరిన ప్రాంతాన్ని ముళ్ల బండగా పిలుస్తారు.
ఆ ప్రాంతంలో స్వామి వారి పాదాలను ఉంచి పాదాల కట్టగా పిలుస్తారు. అక్కడ నుంచి షమీ వృక్షం వద్ద స్వామి వారు సేదతీరి ఉదయం వేకువజాము వరకు ఎదురు బసవన్న గుడి వద్దకు వెళ్లి మంచి చెడులు, పంటల ధరలను స్వామి వారు భవిష్యవాణి(కార్ణికంగా) వినిపించారని ఇదే భవిష్యవాణి ఇప్పట్టికి కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. అక్కడి నుంచి సింహాసనం కట్ట వద్దకు చేరుకొని కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడంతో జైత్రయాత్ర ముగుస్తుంది.
800 అడుగుల ఎత్తుల్లో కొలువుధీరీన మాల మల్లేశ్వర స్వామిగా...పార్వతి,పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేసి ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాతే ప్రజలు పెద్ద ఎత్తున కర్రలు, అగ్ని ఖాగడాలు చేత బూని శివ,పార్వతుల కల్యాణం జరిపించి అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే బన్నీ కర్రల(సమరం)హోరాహోరీగా జరుగుతుంది.
వందల ఏళ్ల క్రితం దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాలలో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు రెండు వర్గాల మధ్య జరిగే సమరమే కర్రల సమరం. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో పాల్గొనే వేల మంది కర్రలు చేతపట్టి కర్రలతో చివర్లో ఇనుప చువ్వ బిగించి బన్నీ ఉత్సవం ఆడుతారు.
ఈ ఉత్సవంలో కొందరు మద్యం సేవించి కూడా ఆడటానికి వస్తుండటంతో హింస జరుగుతోంది. తాగిన మైకంలో బన్నీ ఆడలేక కర్రలు ఇతరుల తలపై పడుతున్నాయి. వాస్తవంగా మెజారిటీ భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. కొందరి కారణంగానే తలలు పగులుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
అందుకే పోలీసులు దేవరగట్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో పండక్కి మూడు రోజుల ముందుగానే నిఘా ఉంచారు. మొత్తం పది బృందాలు.. అంటే సుమారు రెండు వేల మంది పోలీసులు బన్నీ ఉత్సవం జరిగే ప్రాంతాల్లో సోదాలు చేశారు. గుట్టలు, కొండలు, ఇళ్లలో తనిఖీలు చేసి.. వెయ్యి కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్సవ మూర్తులను తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడటం ఆక్రమంలో తలలు పగలడం,వెంటనే బండారు పూసుకుని మళ్లీ బన్నీలో పాల్గొంటారు. అదే క్రమంలో వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకుంటున్నారు. అయితే గ్రామస్థులు మాత్రం ఇది ఓ క్రీడాగా భావిస్తున్న భీకర కర్రల సమరం జరుగుతోంది. ఎప్పట్టికీ నెరణికి గ్రామస్తులే ఉత్సవ మూర్తులను దక్కించుకుని తెల్లవారు జాము వరకు పూజలు చేసి తిరిగి శివుడి ఆలయంలో ప్రతిష్టించి సింహాసనం కట్ట వద్ద అందరూ కలసి ఉత్సవాలు విజయవంతం చేస్తారు.
దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయంలో రేపు యథావిధిగా పూజలు,స్వామి వారి కల్యాణం,భవిష్యవాణి,వంటి కార్యక్రమాలు ఆలయ కమిటీ పెద్దలు నిర్వహిస్తారని అధికార్లు వెల్లడించారు. ఉత్సవాలకు,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భారీ పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు.