CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్ ప్రారంభం
Owk Tunnel Inauguration: ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం అవుతుందని సీఎం తెలిపారు.
రాయలసీమలలో కొన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఇది గాలేరు - నగరిలో ఓ భాగం. ఈ అవుకు టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం అవుతుందని సీఎం తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు నీరు ఇవ్వడం ఈ టన్నెల్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. అవుకు వద్ద చేపట్టిన మూడో టన్నెల్ పనులు చివరి దశకు చేరుకున్నట్లుగా జగన్ తెలిపారు. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేసినట్లు చెప్పారు.
ఈ మూడు టన్నెళ్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.
శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే సమయంలో ఆ అదనపు నీటిని రాయలసీమకు తరలించనున్నారు. రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించడం ఉద్దేశం. రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు అప్పట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కిలో మీటర్ల పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాలకు ప్రణాళిక వేశారు.
పెద్ద దర్గాలో ముఖ్యమంత్రి జగన్
మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి.. ప్రభుత్వ లాంఛనాలతో పూల చద్దార్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు.. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆది మూల సురేష్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆనంద పరవశులయ్యారు. ఈ దర్గా ఖ్యాతీ, మహిమలు.. ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే.. కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణం అన్నారు. తాను పుట్టిన సొంత జిల్లాలో.. ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భవిస్తున్నామన్నారు.
అంతకు మించి ఆమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధారిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో.. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తూ.. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న.. మిత్రుడు ఎస్.బి.అంజాద్ బాషాకు అభినందనలు తెలుపుకుంటున్నామన్నారు.