High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Kadapa Elections 2024: కడప జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కడప పట్టణంలో, జమ్మలమడుగులో బీజేపీ, వైసీపీ శ్రేణులు మధ్య రాళ్ల దాడి జరడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
High Tension in Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టిడిపి ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు.
కడపలో ఉద్రిక్త వాతావరణం
కడప నగరంలోని గౌస్ నగర్ లో 28 వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 155, 156 వార్డుల్లో వైసిపీ, టీడీపీ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దూషణలకు దిగి, ఆపై రాళ్ల దాడులు చేసుకున్నారు. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి, అభ్యర్థి మాధవి రెడ్డి సైతం అక్కడే ఉన్నారు. సమాచారం అందుకున్న కడప డిఎస్పీ షరీఫ్, పోలీస్ బలగాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఏపీలో ముగిసిన పోలింగ్, పలు చోట్ల దాడులతో ఉద్రిక్తత
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల భౌతిక దాడులు, రాళ్ల దాడులతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాయంత్రం 6 గంటల వరకూ ఏపీలో 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకుంది.