Anantapur: ఇక్కడ చిటికెలో చేపల పులుసు రెడీ, ఈ పర్యటక కేంద్రానికి వస్తే రకరకాల ఫుడ్‌తో మజా చేసుకోవచ్చు!
Anantapur: వశికేరప్ప చేపల పులుసు.. అనంతపురం సమీప ప్రాంతాల ప్రజలకు సుపరిచతం. ఎంతలా అంటే బ్యాాచిలర్ పార్టీలు.. నాన్ వెజ్ పంక్షన్లు ఎక్కడైనా సరే వశికేరప్ప చేపల పులుసుకు ప్రాధాన్యం ఇస్తారు.
Anantapur Chepala Pulusu: ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు బృందంలోని సభ్యులందరికీ ఆహారపదార్థాలను తీసుకెళ్ళడం ఒక ప్రయాసనే చెప్పాలి. ట్రిప్ కు వెళ్ళే ముందే ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం.. వాటిని ప్యాక్ చేయడం.. నూనె పదార్థాలు తొణకకుండా జాగ్రత్తలు తీసుకోడం లాంటి పనులతో టూర్ కాస్త గాడి తప్పడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇవన్నీ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టేలా మనకు కావాల్సిన రుచికరమైన ఆహారం పర్యాటక ప్రాంతంలోనే లభిస్తే.. అది కూడా వేడి వేడిగా సరసమైన ధరలకు దొరికితే.. శుభ్రంగా ఉండి, ఘుమఘుమలాడితే.. ఇంకేముంది ఎగిరి గంతులేయడమేగా. అలాంటి ఓ ప్రాంతం గురించి ప్రత్యేక కథనం.
PABR Dam (పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) అలియాస్ కొర్రకోడు డ్యాం. అవును నిజమే. డ్యాం సందర్శించే పర్యటకులకు మాత్రం ఆహారం తీసుకెళ్లే తిప్పల నుంచి ఇక్కడ ఉపశమనం లభిస్తుంది. కారణం తక్కువ ధరకే అప్పటికప్పుడే వేడివేడిగా కావలసిన ఆహార పదార్థాలు అందిస్తున్నారు అక్కడ హోటల్ నిర్వాహకులు వశికేరప్ప. చేపలలో కట్లాలు, సీసీలు, జిలేబీలు, రోహులు తదితర రకాలు లభిస్తాయి. టైగర్ ప్రాన్స్, పీతలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. వీటితో పాటు నాటుకోడి పులుసు తప్పక రుచి చూడాల్సిందే.
చేపల పులుసు, చేపల వేపుడు, చేపల కబాబ్ ఇలా అన్ని వెరైటీస్ లో కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు తయారు చేసి ఇస్తారు. దీన్నిబట్టే వాటి రేటు కూడా ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ చేపల పులుసు లభ్యమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన అర గంటలోనే తయారు చేయడం వీరి ప్రత్యేకత. మరొక విషయం.. ఆదివారం కావాలంటే మాత్రం శనివారం సాయంత్రమే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది.
సుమారు ఈ హోటల్లో సిబ్బంది ఎనిమిది మంది పని చేస్తూ ఉంటారు. ఆదివారాలలో సగటున 300 కేజీల చేపల పులుసు విక్రయిస్తున్నారంటే ఇక్కడ లభించే చేపల పులుసుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పులుసులో వేసే మసాలాల విషయంలోనూ వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. స్వయంగా శుభ్రం చేసిన దినుసులతోనే ఇంట్లోనే మసాలాలు తయారుచేసుకుంటామని చెబుతారు హోటల్ నిర్వాహకురాలు జానకమ్మ. కొత్తిమీర, మెంతికూరలాంటి వాటిని అక్కడే పండించుకుని తాజాగా ఉపయోగించుకుంటారు.
పీఏబీఆర్ డ్యాం అందాలను చూస్తూ చేపల పులుసు రుచి చూడాలని ఉందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం ..పదండి మరి కొరకోడు డ్యాంలో వశికేరప్ప హోటల్ కి..