Kuppam News: కుప్పానికి ఒక్కరోజులోనే నీళ్లు ఆగిపోయాయా? కాలువలోకి దిగి రైతుల నిరసనలు
Kuppam ప్రాంతానికి హంద్రీ - నీవా నీళ్లను సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వదిలితే.. రాత్రి పదిన్నర కల్లా నీళ్లు నిలిచిపోయాయని రైతులు అంటున్నారు.
Farmers Protest in Kuppam Branch Canal: కుప్పం నియోజకవర్గానికి క్రిష్ణా నీటిని తమ ప్రభుత్వం తీసుకువెళ్లగలిగిందని, తద్వారా అక్కడి రైతుల వ్యవసాయ అవసరాలు తీరతాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 26) నాటి సభలో చెప్పిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచి కాలువ (కేబీసీ) పరిధిలోని 110 చెరువులను నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్ సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. కట్ చేస్తే.. మంగళవారం కుప్పం రైతులు కుప్పం బ్రాంచ్ కెనాల్ లోకి దిగి బైఠాయించి నిరసన తెలిపారు.
కుప్పం ప్రాంతానికి హంద్రీ - నీవా నీళ్లను సీఎం జగన్ ఉదయం 11 గంటల ప్రాంతంలో వదిలితే.. రాత్రి పదిన్నర కల్లా నీళ్లు నిలిచిపోయాయని రైతులు అంటున్నారు. ఎంకే పురం గ్రామస్థులు, టీడీపీ నాయకులతో కలిసి కూర్చొని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో జగన్ హెలికాప్టర్ లో వచ్చి, భారీ సభ నిర్వహించి కుప్పంకు నీళ్లు వదిలామని చెప్పుకుంటున్నారని అన్నారు. హంద్రీ - నీవా కాలువను చంద్రబాబు హాయాంలో రూ.400 కోట్లతో 88 శాతం పూర్తి చేస్తే.. జగన్ సర్కారు వచ్చాక గత ఐదేళ్లలో ఏమీ చేయలేదని రైతులు ఆరోపించారు. చంద్రబాబుపై లేనిపోని తప్పులు చెప్పి.. ఆయన్ను తిట్టడానికే భారీ సభ పెట్టారని రైతులు ఆరోపించారు.
తాత్కాలికంగా గేటు పెట్టి ముందుగానే నిల్వ చేసుకున్న నీటిని వదిలి.. కృష్ణా నీళ్లు కుప్పం వైపు ప్రవహిస్తున్నట్లుగా బహిరంగ సభలో ప్రజలకు కట్టుకథ చెప్పారని రైతులు ఆరోపించారు. సీఎం సాగునీటిని విడుదల చేసిన తర్వాత సోమవారం అర్ధరాత్రికి శాంతిపురం మండలం ఎంకేపురం వరకు కృష్ణా జలాలు రావడమే కష్టంగా ఉందని రైతులు వాపోయారు. మంగళవారం ఉదయానికి అసలక్కడ నీటి ఆనవాళ్లే లేవని.. కాలువలో నీటి చెమ్మ కూడా లేదని చెప్పారు. వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటును మంగళవారం ఉదయమే సిబ్బంది తొలగించారని చెప్పారు. కాలువల్లో నీటి తడి కూడా లేకపోవడంతో స్థానికులు, టీడీపీ వర్కర్లు ఆ కాలువలోకి దిగి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.