Breaking News Live: తూ.గో.జిల్లాలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
అసని తుఫాన్ ప్రభావం తగ్గడంతో ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్నాయి. పగటి వేళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 దాటాయి. మరికొన్ని రోజుల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. ఉక్కపోత, తేమ అధికం కావడంతో ప్రజలు ఎండ వేడమిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒకట్రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అమరావతిలో 38 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 39 డిగ్రీలు, గన్నవరంలో 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని సూచించారు. నేటి నుంచి ఇక్కడ ఎండలు మండిపోతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొది. అనంతపురంలో పగటి ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటిపోయింది. కర్నూలులో 39.3 డిగ్రీలు, నంద్యాలలో 38.2 డిగ్రీలు, కడపలో 38 డిగ్రీల మేర నమోదైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. ( Temperature in Telangana)
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత అధికం కానున్నాయి. కొన్ని చోట్ల 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. కొన్ని జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నిలకడగా ఉంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర నేడు కిలోకు రూ.400 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,590 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.73,400 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.73,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,590గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.73,400 గా ఉంది.
తూ.గో.జిల్లాలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతు
తూర్పు గోదావరి జిల్లాలో నాటు పడవ మునిగి ఇద్దరు గల్లంతయ్యారు. తూర్పు ఏజెన్సీ వై రామవరం మండలం డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. పడవలో మొత్తం 8 మంది ఉండగా 6 గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు దొంకరాయి ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఫైనల్ లో థాయిలాండ్ క్రీడాకారిణి బుసానన్ పై విజయం సాధించింది. ఫైనల్ లో 21-16, 21-8 తేడాతో పీవీ సింధు గెలుపొందింది.
బైక్ పై ట్రిపుల్ రైడింగ్, అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టిన యువకులు
జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒకే వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజు ఆపే ప్రయత్నం చేశారు. వారు పారిపోయే ప్రయత్నంలో హోంగార్డును వేగంగా ఢీకొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ హోం గార్డు రాజును చికిత్స నిమిత్తం వెంటనే ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Chittoor Ithepalli Accident: చిత్తూరు జిల్లాలో మరో బస్సు బోల్తా
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన మరవకముందే అదే జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ట్రాక్టర్ ను ఢీ కొని ప్రక్కనే ఉన్న మామిడి తోటలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉందని, మరో 17 మందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను తిరుపతి హాస్పిటల్ కి తరలిస్తు్న్నారు. రాజంపేట నుండి దామలచెరువు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయం కలకలం
* నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ లో శిశు విక్రయం
* నవజాత శిశువును 20 వేలకు విక్రయించిన తల్లిదండ్రులు భీమవ్వ, కొమరయ్య
* పుట్టిన 24 గంటల్లోనే నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన వైనం
* బిడ్డను పోషించే స్తోమత లేదని చెబుతున్న తల్లిదండ్రులు
* దీనిపై అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది విచారణ
* సంచార జీవనం గడుపుతున్న భీమవ్వ కొమరయ్య
* సిద్దిపేటకు చెందిన వారిగా గుర్తింపు