Konaseema Cyclone Effect : కాకినాడ - కోనసీమ మధ్య తీరం దాటనున్న అసని తుపాను, అప్రమత్తమైన అధికారులు
Konaseema Cyclone Effect : అసని తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై అధికంగా ఉంటుందని ఆ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
Konaseema Cyclone Effect : అసని తుపాను మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు మీదుగా పయనిస్తూ కాకినాడ-కోనసీమ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సఖినేటిపల్లి-ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందన్నారు. కలెక్టర్.. చిర్రా యానాం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, రహదారులు భవనాల శాఖ, శిశు సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ రాజ్, పశుసంవర్ధక వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో తుపాను అప్రమత్తత, సహాయక చర్యలపై మంగళవారం కలెక్టర్ సమీక్షించారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షంతోపాటుగా ఈదురు గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని, పవర్ రంపాలు, జేసీబీలతో రహదారులపై పడిన చెట్లు తొలగింపు సహాయక చర్యలకు సమాయత్తం కావాలన్నారు. ఇరిగేషన్ అధికారులు ఇసుక బస్తాలు సిద్ధం చేసుకుని గండ్లు పూడ్చేందుకు సన్నద్ధం కావాలన్న కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీచేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 08856293104.
విశాఖలో అధికారుల అప్రమత్తం
అసని తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి విడదల రజిని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం, వర్షాలు జోరందుకున్న నేపథ్యంలో ఆమె మంగళవారం కలెక్టర్ తో మాట్లాడారు. అసని తుపాను బాధితులుగా జిల్లాలో ఒక్కరు కూడా ఉండటానికి వీల్లేదని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు చేపట్టాలన్నారు. విద్యుత్ కోతలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కరెంటు స్తంభాలు, చెట్లు.. ఇలా వేటికి నష్టం వాటిల్లినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జనజీవనానికి విఘాతం కలగకుండా చూడాలన్నారు. డ్రెయినేజి వల్ల నష్టం జరగకుండా చూడాలన్నారు. రెస్య్కూ టీంలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలన్నారు. తీర ప్రాంతవాసులను అప్రతమత్తం చేయాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు. పునరావాస కేంద్రాల వద్ద వసతి, భోజన సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు.