YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్- సాక్షిగా షర్మిల ఏం చెప్పారంటే?
YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో మరో కీలక అప్‌డేట్ వచ్చింది. వైఎస్ షర్మిల సాక్షిగా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారట
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది. పులివెందుల ఎంపీ సీటుకు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చినట్టు సీబీఐ తన షార్జిషీట్‌లో పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ లాంటి సాంకేతిక అంశాలపై కూడా సీబీఐ వివరణ ఇచ్చింది. వీటన్నింటిని కొద్ది రోజుల క్రితం కోర్టుకు సమర్పించింది. ఇప్పుడు అందులోని అంశాలు బయటకు వస్తున్నాయి.
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో గూగుల్ టేక్ అవుట్ సమాచారంపై సీబీఐ తడబడినట్టు తెలుస్తోంది. గ్రీన్‌విచ్ కాలమానం, భారత కాలమానం ప్రకారం తేడా గుర్తించలేకపోయామని పేర్కొన్నట్టు సమాచారం. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ అవుట్‌పై సీబీఐ మాట మార్చిందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి సహా కీలకమైన వారిపై ఆరోపణలు ఉన్నప్పటికీ ఆధారాలు లేవని కూడా చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో కీలకమైన వాంగ్మూలం ఇచ్చిన వైఎస్ షర్మిల... చిన్నాన్న కడప ఎంపీ సీటును ఆశించలేదని అన్నారు. తనకు సైతం కడప రాజకీయాలపై ఆసక్తి లేదని వివేకాకు చెప్పానని షర్మిల వివరించారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయడం వివేకాకు ఇష్టం లేదని అందుకే తనను ఒప్పించారని చెప్పారు షర్మిల. కుటుంబం బయటకు కనిపించనంత బాగోలేదని కోల్డ్ వార్ ఉండేదని చెప్పారు. తనకు ఎలాంటి టికెట్ రాదని గ్రహించే ఎంపిగా నన్ను ఎంచుకోవడానికి ఒప్పించారని షర్మిల చెప్పినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా బాబాయ్ ఓటమికి కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డే కారణమని తెలిపారు. 259 వ సాక్షిగా షర్మిల గత అక్టోబర్ 7 సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
ఇటీవల ఛార్జిషీటులో ఏముందంటే..?
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు జులై 14వ తేదీన సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని వైకాపా ఎంపి అవినాష్ రెడ్డికి సమన్లు పంపింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డిపై ఛార్జిషీట్ వేసింది. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా సిబిఐ అవినాష్ రెడ్డిని చేర్చింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు చేసిన కుట్రలో నిందితుల పాత్ర స్పష్టంగా ఉందని సీబీఐ దాఖలుచేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిసింది. హత్యకు డబ్బు సమకూర్చిందెవరో తేలాల్సి ఉందన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ కేసులో సీబీఐ కోర్టుకు అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. ఇందులో A-6గా ఉదయ్‌కుమార్‌రెడ్డి, A-7గా వై.ఎస్.భాస్కరరెడ్డి, A-8గా వై.ఎస్.అవినాష్‌రెడ్డిలను పేర్కొంది. వివేకా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎం.వి.కృష్ణారెడ్డి, వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మి కుమారుడు ఏదుల ప్రకాష్‌లను ఇదే కేసులో అనుమానితులుగా పేర్కొంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసినా.. ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వివేకా చనిపోయే ముందు రాసిన లేఖలో వేలిముద్రలు, చేతి రాతను గుర్తించడంలో భాగంగా లేఖను కోర్టు నుంచి సీబీఐ తీసుకుని, దిల్లీ ఎఫ్ఎస్ఎల్కు పంపింది. నిన్‌హైడ్రిన్ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించాలని కోరింది. ఎం.వి.కృష్ణారెడ్డి, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్‌ను అనుమానితులుగా పేర్కొంది. వీటన్నింటిపై స్పష్టత నిమిత్తం దర్యాప్తును మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి విజ్ఞప్తిని కోర్టులకు చేయలేదు. గడువు సుప్రీంకోర్టే నిర్ణయించినందున.. అదనపు గడువు కోసం కూడా ఆ కోర్టు దగ్గరే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. కానీ సీబీఐ ఇప్పుడు తుది ఛార్జిషీటును మార్చడంతో మొత్తం విషయం అంతా మారిపోయింది.