Kadiri News : రోడ్ల దుస్థితిపై కదిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ, తూపల్లిలో ఉద్రిక్తత
Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి ప్రజాగ్రహం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రజలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Kadiri News : కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి స్థానికులు సమస్యలపై నిలదీశారు. బురదగుంటల్లా మారిన రోడ్ల పరిస్థితిపై ప్రశ్నించారు. ప్రజలను ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అనుచరులు అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ పుట్టపర్తి జిల్లా తూపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి గ్రామస్థులు సమస్యలు ఏకరవు పెట్టారు. తేలికపాటి వానకే వీధులు బురదమయం అవుతున్నాయని వాపోయారు.
ఎమ్మెల్యేతో వాగ్వాదం
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, అధికారులు సత్యసాయి పుట్టపర్తి జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామంలో పర్యటించారు. తేలికపాటి వానకురిస్తే చాలు వీధులన్నీ బురదమయం అవుతున్నాయని, సర్పంచి, ఎంపీటీసీతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరికి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి సమస్య తీసుకెళ్తుంటే అడ్డుపడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. తాము ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక నాయకులు పనులు చేయరు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లనీయకపోతే ఎలా అని గ్రామస్థులు నిలదీశారు.
పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం
ఎమ్మెల్యేను గ్రామస్థులు నిలదీయటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. పంటల బీమా విషయంలో కూడా సచివాలయ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేశారని మహిళా రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులైన వారందరికీ బీమా వర్తింపచేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని, బీమా అందని వారి నుంచి అవసరమైన వివరాలు సేకరించాలని వ్యవసాయశాఖ, సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి రహదారి సమస్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని స్థానికులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అంబటికి నిరసన సెగ
వైసీపీ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వైసీపీ మంత్రులు, నేతలకు నిరసన సెగలు తప్పడంలేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఓ వైపు ప్రభుత్వం పండగలా పింఛన్ అందిస్తున్నామని చెబుతుంటే కొన్ని చోట్ల పింఛన్ విషయంలో ఆందోళనలు ఎదురవుతున్నాయి. తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అర్హత ఉన్నా తమకు పింఛన్ నిలిపివేశారని మంత్రి అంబటి రాంబాబును ఓ మహిళ నిలదీసింది. తనతో పాటు వికలాంగుడైన తన తమ్ముడికి కూడా పింఛన్ రావట్లేదని ఈ విషయంపై అధికారులికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ప్రశ్నించింది. ఇదేనా పాలన అంటే అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వాలంటీర్లు ఉద్ధేశపూర్వకంగా తన పింఛన్ ఆపేశారని బాధిత వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై త్వరలోనే న్యాయం చేస్తామని పెన్షన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చి ఆయన అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయారు.