JC Diwakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు కానీ జేసీ దివాకర్ రెడ్డి సైలెంట్ - కారణమేంటి ?
ఎన్నికలు దగ్గర పడుతున్నా జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ కావడం లేదు. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి మాత్రం యాక్టివ్ గానే ఉన్నారు.
JC Diwakar Reddy : అనంతపురం రాజకీయాల్లో జేసి దివాకర్ రెడ్డిది ఓ ప్రత్యేకమైన అధ్యాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతగా జిల్లా రాజకీయాలను శాసించారు. తాడిపత్రి నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో రిటైర్మెంట్ తీసుకుని కుమారుడ్ని ఎంపీగా నిలబెట్టారు.కానీ పరాజయం పాలయ్యారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ దివాకర్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.
జేసీ దివాకర్ రెడ్డి మౌనానికి కారణం ఏమిటి ?
స్వపక్ష నేతలైనా, విపక్ష నేతల గురించి అయినా నిర్మోహమాటంగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి.. తరచూ వార్తల్లో ఉంటారు. కొంత కాలంగా ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలేవి చేయకుండా మౌనంగా ఉంటున్నారు. 1983లో తొలిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వతంత్రంగా ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత 1985లో కాంగ్రెసు పార్టీ తరుపున తొలిసారిగా పోటీ చేశారు. అప్పటి నుంచి 2009 వరకు కాంగ్రెసుపార్టీ తరుపేనే పోటీ చేసి డబుల్ హ్యాట్రిక్ విజయాలను సాధించారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆయన తనయుడు జెసి. పవన్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా పోటీ చేశారు. ఆయన ఓటమి చెందారు.
ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్ గానే ఉన్న దివాకర్ రెడ్డి
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా రాజకీయంగా హడివుడే చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డిపైనా అనేక విమర్శలు చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం వైపున ఉంచి ఆయనకు సంబంధించి గనులను మూసివేయడం తదితర సమస్యలు చుట్టుముట్టినా తన విమర్శల పదునును తగ్గించలేదు. కొంత కాలంగా వీటికి దూరంగా ఉంటూ, ఎటువంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉంటూ వస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీస్తున్న తరుణంలోనూ ఆయన రాజకీయపరంగా యాక్టివ్‌గా లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన తనయుడు పవన్‌కుమార్‌రెడ్డి కూడా రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలో కేశ్ పాదయాత్రలోగాని, పార్టీ కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించటం లేదు. దీంతోవారు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో లేరేమో అన్న చర్చ జరుగుతోంది.
యాక్టివ్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు
దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. లోకేష్ పాదయాత్రను దగ్గరుండి విజయవంతమయ్యేలా చూశారు. తరచూ లోకేష్ ను కలిసి వస్తున్నారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. దివాకర్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలు మాత్రం ఎన్నికల సమయం ఆసన్నమైనా కనిపించకపోవడం చర్చనీయాంశమూ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ బరిలో దిగుతారా లేక పార్లమెంటుకే మరోమారు ప్రయత్నిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది.