Pawan Kalyan: టీచర్స్ డే వేళ టీచర్లకు జీతాల్లేవు, వైసీపీ సర్కారుపై పవన్ కల్యాణ్ విమర్శలు
Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ టీచర్లపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని పవన్ కల్యాణ్ విమర్శించారు.
Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వ ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రంలోని టీచర్లకు పవన్ కల్యాణ్ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అమ్మానాన్నల తర్వాత అదే స్థాయి ఆప్యాయత, వాత్సల్యం గురువుల వద్దే లభిస్తాయని పవన్ చెప్పుకొచ్చారు. గురు దేవుళ్లు ఎలాంటి ప్రతిఫలం కోరుకోకుండా విజ్ఞానాన్ని పంచుతారని, శిష్యుల విజయాలనే తమవిగా భావిస్తారని అన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు తరగతి గది నుంచే విద్యార్థులకు ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెప్పారు. తమ శిష్యులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది, దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలు ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉంటున్నాయని పవన్ మండిపడ్డారు. రాష్ట్ర సర్కారు టీచర్లకు బోధనేతర విధులు అప్పగించి వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. నాడు-నేడు పనుల్లో అధికార పార్టీ నేతలు చేసే తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు.
గురు దేవుళ్ళకు శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #TeachersDay#teachersday2023 pic.twitter.com/4dFuc6VXu0
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2023
టీచర్లకు సరైన సమయంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ర్కారు ఉందని జనసేన అధినేత ఎద్దేవా చేశారు. పదోన్నతులు పొందిన, ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకునే ఈ సమయంలో కూడా రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించకపోవడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఏపీ రాష్ట్ర సర్కారు టీచర్లపై ఎలాంటి వైఖరి అవలంబిస్తోందో దీంతోనే అర్థం అవుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవ మర్యాదలను కాపాడుతుందని చెప్పారు.
బాల్యం నుండి జీవితంలో అడుగడుగునా జ్ఞానాన్ని అందిస్తూ, సరైన పథంలో నడిపిస్తున్న గురువులందరికీ జనసేన పార్టీ తరపున గురు పూజోత్సవ శుభాకాంక్షలు.#TeachersDay #teachersday2023 pic.twitter.com/ayrqMWoGmP
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2023
సర్వేపల్లి జయంతి సందర్భంగా టీచర్స్ డే
సర్వేపల్లి రాధాకృష్ణన్ కష్టానికి గుర్తింపుగానే టీచర్స్ డే ను ఆయన పుట్టినరోజున టీచర్స్ డే జరుపుకుంటాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగు వ్యక్తే. అతని తల్లిదండ్రులు తెలుగు వారే. బతుకును వెతుక్కుంటూ ఈ తెలుగు దంపతులు తమిళనాడులోని తిరుత్తణికి వలస వెళ్లిపోయారు. అందుకే రాధాకృష్ణయ్య తమిళనాడులో రాధాకృష్ణన్ గా మారిపోయారు. రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి అపారమైన తెలివితేటలను కలిగి ఉన్నారు. పదహారేళ్ళకే మద్రాస్‌లోని క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడ పట్టభద్రుడు అయ్యాక అదే కళాశాలలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. 20 ఏళ్ల వయసులోనే బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ పూర్తిచేశాడు. రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెంట్ కాలేజీలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలోని తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా చేరారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సుకు ప్రాతినిధ్యం వహించారు.
వైజాగ్ లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనదేశంలోని పెద్ద విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసిన వ్యక్తి. తర్వాత రష్యాకు భారత రాయబారిగా వెళ్లారు. భారతరత్న బిరుదును కూడా పొందారు. మన దేశ రెండవ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలైంది. 1962 నుండి మనదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించుకుంటున్నారు.