Pawan Kalyan: పవన్ పదవీ బాధ్యతలు చేపట్టిన టైంలో టేబుల్‌పై ఉన్న పుస్తకం ఏంటీ? ఎందుకు వెంట పెట్టుకొని తిరుగుతారు?
Pawan Kalyan: నేను పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ కలమెత్తితే దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది’’ పవన్ చెప్పే ఈ మాటలు ఎక్కడివో తెలుసా
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డీప్యూటీ సీఎంగా బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా తొలి ఫైలుపై సంతకం చేసిన నేపథ్యంలో టేబుల్ మీద ఉన్న ఓ పుస్తకం అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘‘ఆధునిక మహాభారతం’’ అనే ఈ పుస్తకాన్ని పవన్ చాలా సార్లు తనతో ఉంచుకోవడం చూడొచ్చు. కానీ పవన్ కు ఆ పుస్తకమంటే ఎందుకంత ఇష్టం. అసలాపుస్తకంలో ఏముంది? ఆ విశేషాలు చూద్దాం.
ఆధునిక మహా భారతం 1970-1986 మధ్య కాలంలో గుంటూరు శేషేంద్ర శర్మ రాసిని వచన కవితా సంకలనాల సమాహారం. పండితులు దీన్ని మహా కావ్యేతిహాసంగా పరిగణిస్తారు. మొత్తం పది పర్వాలలో 1970, 1980 నాటి భారత దేశాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు ప్రతి మనిషిలోని మనిషిని తట్టి తేపుతుంది.
త్రివిక్రమ్ ఇచ్చాడు..
కొన్నేళ్ల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెకండ్ హ్యాండ్ పుస్తకాల మార్కెట్ లో ఈ పుస్తకాన్ని కొనుగోలు చేాశారు. ఆ పుస్తకం త్రివిక్రమ్‌కి విపరీతంగా నచ్చడంతో దాన్ని తన స్నేహితుడైన పవన్‌కి పంపారు. ఈ ఆధునికి మహా భారతం పవన్ కి బాగా నచ్చడం.. ఆ రైటర్ గురించి ఎంక్వయిరీ చేయడం జరిగాయి. ఇంత మంచి పుస్తకం మార్కెట్‌లో ఎక్కడా కొనేందుకు అందుబాటులో లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్య పోయారు. ఎలాగైనా ఈ పుస్తకాన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనుకున్న పవన్ ఆ రచయిత కుమారుడితో మాట్లాడి.. ఆర్థిక సాయం చేశారు. దీంతో ఆధునిక మహా భారతం 25 వేల కాపీలు ప్రింటయింది.
‘‘ఒకదేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు. కలల ఖనిజాలతో చేసిన యువత మన దేశ భవిష్యత్తు నావికులు అన్న మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్ని అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసముంటే దేశంలో అంధకారం ఉటుందా..? అని ఆయన వేసిన ప్రశ్న నాకు మహా వాక్యమైంది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆధునిక మహాభారతమనే ఈ మహాగ్రంథం దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే వారికి అందుబాటులో ఉంచాలనే నా ఆకాంక్ష ఈ మహా గ్రంధాన్ని ఇంకోసారి మీ ముందుకు తెచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన మహాకవి శేషేంద్రశర్మ అబ్బాయి, కవి అయిన సత్యకి , నాకీ మహా కవిని పరిచయం చేసిన నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి నా కృతజ్ణతలు’’ అని పవన్ తన చేతి రాతతో 2016లో రాసిన లేఖ ఒకటి ప్రాచుర్యంలో ఉంది
ఇలా ఆ పుస్తకాన్ని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చిన పవన్ పై ఆ పుస్తకం ప్రభావం చాలా ఉంటుంది. చాలా సార్లు పవన్ ఆ పుస్తకం గురించి తన స్పీచుల్లో ప్రస్తావించారు.
పవన్ స్పీచుల్లో ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా?
‘‘నేను డ్యాములెందుకు కడుతున్నానో తెలీదు. భూములెందుకు దున్నతున్నానో తెలీదు. నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్లు కాళ్లయి నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమైనా దక్కేది మనిషినై అన్ని వసంతాలూ కోల్పోయాను’’
‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు. తుఫాను గొంతు చించుకొని అరవడం ఎరగదు. పర్వతం ఎవరికీ ఒంగి సలాం చేయదు. నేను పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ కలమెత్తితే దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది’’
‘‘ప్రజల ఓట్లతో అందలమెక్కిన నాయకులకు మనం ఒక్కటే చెబుదాం. దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులిస్తాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా యోచించు ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఓ సముద్రం దాటావు. మరువకు మిత్రమా మరువకు’’
‘‘భావి తరాలకు ఏ సంపద విడిచి పెట్టావ్ యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప.. గాయాలు, బాధలు, వేదనలు తప్ప.. కళలు, కలలు, కల్లలు తప్ప, పిరికితనం, ద్రోహం, మోసం తప్ప’’
‘‘తమ హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలు విరిచే ప్రభుత్వానికి ఇదే మన మాట.. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా.. లోక బాధనవుడసలే లేకుండా పోతాడా.. మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీయకుంటే.. ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా? కుటిలాత్ముల కూటమికొక తృటికాలపు జయమొస్తే.. విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా? ధనుజలోకమేకంగా.. దారికడ్డు నిల్చుంటే.. నరజాతి ప్రస్తానం పరిసమాప్తమవుతుందా?’’
ఇవన్నీ పవన్ నోట వింటే అభిమానులకు, ప్రజలకు ఎంత ఉత్తేజకరంగా ఉంటుంది? వీటన్నింటినీ పవన్ ఈ ఆధునికి మహా భారతం నుంచే కోట్ చేశారు. ‘‘గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే చాలా సబబైనదనిపిస్తుంది’’ అని పవన్ చెబుతారు.