Hyderabad News: జూన్ 2 తర్వాత తెగిపోనున్న ఉమ్మడి బంధం- ఇంకా తేలని హైదరాబాద్‌లో ఆస్తుల పంచాయితీ
Hyderabad Joint Capital: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు జూన్ రెండో తేదీతో ముగియనుంది. దాని తరువాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.
Andhra Pradesh Capital: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) విభజన (Andhra Pradesh Bifurcation) జరిగి దాదాపు 10 ఏళ్లు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (AP Re-Organisation Act) ప్రకారం హైదారాబాద్ (Hyderabad) 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని (Joint Capital)గా నిర్ణయించారు. ఈ మేరకు 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ రెండో తేదీతో ఈ గడువు ముగియనుంది. దాని తరువాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు అన్నీ ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. 2016లోనే 90 శాతం కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి మారిపోయాయి. తాజాగా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు. రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లైనా ఆస్తుల పంపిణీ మాత్రం పూర్తి కాలేదు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు సైతం పూర్తి స్థాయిలో అమలు కాలేదు.
ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదా?
విభజన హామీలు, ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. జూన్ 2తో ఉమ్మడి రాజధాని అంశం ముగియనుంది. దీనిని కొనసాగించే అవకాశం ఉన్న ఏపీ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదన్న వాదన ఉంది. వైసీపీకి కేంద్రంలో పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీ సైతం ప్రస్తుతం పొత్తులో ఉండడంతో కేంద్రంతో మాట్లాడి హైదరాబాద్‌ను మరో ఐదేళ్లు ఉమ్మడి రాజధానిగా పొడిగించే ప్రయత్నం చేయాల్సి ఉందని మెజారిటీ నిపుణలు భవించారు. కానీ దీనిపై ఏపీ అధికార, ప్రతి పక్షాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రాజధాని విషయంపై చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పరిష్కారం కాని సమస్యలు ఎన్నో
ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పూర్తిగా పరిష్కారం అవలేదు. ఆర్టీసీ ఆస్తుల వివరాల లెక్క తేలలేదు. విభజన చట్టంలో ఆర్టీసీ ఆస్తులను 10 ఏళ్లలోగా పరిష్కరించుకోవాలని చెప్పకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం దానికి అనుకూలంగా మార్చుకుంది. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి రూ.5 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. వీటిని సైతం ఏపీ రాబట్టుకోలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఉద్యోగుల పంపిణీ కూడా అసంపూర్ణంగానే జరిగింది.
మూడు రాజధానుల పాట
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించింది. అయితే దీనిపై కేసులు నడుస్తుండంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఎన్ని అడ్డొంకులు వచ్చినా మూడు రాజధానులు అమలు చేస్తామని చెబుతున్న వైసీపీ.. విశాఖ పట్నంలో ఇప్పటికే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో గెలిచిన అనంతరం విశాఖ నుంచే పాలన సాగిస్తామని వైఎస్ జగన్ సైతం చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా చేసి పాలన అందిస్తామని చంద్రబాబు సైతం చెప్పడంతో ఏపీ రాజధానిపై ఏర్పడిన సందిగ్ధత వీడడం లేదు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి
తెలంగాణ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల కోరారు. హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని లక్ష్మీనారాయణ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీకి రాజధాని లేదని, ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎక్స్ వేదికగా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.