TTD Board : టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..
టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారు పదవులకు అర్హులు కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వారిని ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. సభ్యులను నియమిస్తూ జారీ చేసిన జీవోను చట్ట విరుద్ధంగా పేర్కొంటూ లాయర్ అశ్వనీకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. బోర్డులోని 14 మందికి నేర నేరచరిత్ర ఉందని, మరో నలుగురిని రాజకీయ కారణాలతో నియమించారని అశ్వనీకుమార్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఈ 18 మందిని ప్రతివాదులుగా చేర్చాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
Also Read : శ్రీశైలంలో దొంగనోట్ల చెలామణి.. బైకుపై వెంబడించిన బంకు సిబ్బంది.. చివరికి ఏం జరిగిందంటే!
దసరా సెలవుల అనంతరం కేసు విచారణను కొనసాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే 18 మందిని ప్రతివాదులుగా చేర్చడంపై తిరుమల తిరుపతి దేవస్థానం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నియామకాలతో వారికేం సంబంధం లేదని వాదించారు. అయితే.. హైకోర్టు మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ లాయర్‌ను ప్రశ్నించింది. ప్రతివాదులకు ఏమైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వారే చెప్పాలని సూచించింది. దసరా సెలవుల తర్వాత విచారణ కొనసాగనుంది.
Also Read: విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి.. మిస్సైన కొద్ది గంటలకే శవంగా..
ఇప్పటికి హైకోర్టులో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై విచారణ జరుగుతోంది. వివాదాస్పదంగా మారిన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. పాలక మండలితో పాటు విడిగా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే ఇది ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read : తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం !
టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ అంశం కోర్టుకు చేరింది. అయితే ఇప్పటికే సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు.
Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?