Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
AP Weather Report: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rains Alert To AP Districts: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని.. తదుపరి 2 రోజుల్లో అల్పపీడనం పశ్చిమదిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని చెప్పారు. మరోవైపు, ఆవర్తనం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ రాయలసీమ, దక్షిణకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
11న ఈ జిల్లాల్లో..
ఈ నెల 11వ తేదీన సోమవారం కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నెల 12న (మంగళవారం)..
ఈ నెల 12వ తేదీన నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు, విశాఖ, కాకినాడ, కోనసీమ, ప.గో, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.
ఈ నెల 13న (బుధవారం)..
కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 14న (గురువారం)..
తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. రాబోయే 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు, రాష్ట్రంలో ఖరీఫ్ వరి కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనా అంతంతమాత్రంగానే సాగుతుండడంతో అన్నదాతలు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ఆందోళన చెందుతున్నారు.