Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో 2 రోజులపాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు మరో అలర్ట్
Andhra Pradesh Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.

Telangana Rains | హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేశారు. ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణలో 2 రోజులపాటు ఇక్కడ వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం వర్షం పడుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయి. వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Dear people of Telangana, GET READY FOR NEXT LPA RAINS from tomorrow in entire TG mainly North, East, Central TG to get super rains, few places will definetely get HEAVY DOWNPOURS due to LPA impact ⚠️⚠️⚠️
— Telangana Weatherman (@balaji25_t) August 25, 2025
Hyderabad - Get ready people for a moderate rain spell tomorrow during…
10 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం
ఆగస్టు నెల చివరి వారానికి వచ్చినా తెలంగాణలో 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సగటు వర్షపాతం సైతం తగ్గింది. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో ఆగస్టు 18 నాటికి రాష్ట్ర సగటు సాధారణం కన్నా 14 శాతం అధికంగా ఉండగా.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అంతలోనే 9 శాతం లోటు వర్షపాతం నమోదయినట్లు వాతావరణశాఖ తెలిపింది. నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 44 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, పెద్దపల్లి (21 శాతం), నల్గొండ (13 శాతం), జయశంకర్ భూపాలపల్లి (13 శాతం), నిజామాబాద్ (12 శాతం), జగిత్యాల (12 శాతం), రాజన్న సిరిసిల్ల (11 శాతం), మంచిర్యాల (10 శాతం), సంగారెడ్డి (6 శాతం) లోటు వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలు కురిసినప్పటికీ జూన్ నెలలో వర్షాలు పడని కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనూ 4 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఏపీలోని కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరికొన్ని గంటల్లోపు ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లోపు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. pic.twitter.com/99ftmwOAqv
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 25, 2025
మంగళవారం నాడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలిపారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు. వీటితో పాటు కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.






















