ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై విశాఖలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సర్కార్ నిరంతర పర్యవేక్షణ...
ఒడిశా రైలు ప్రమాద ఘటన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపట్టింది. ప్రమాదంలో చిక్కుకున్న బాధితులతో పాటు మరణించిన వారి డెడ్ బాడీస్ తరలింపుపై సర్కార్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. విశాఖ పట్టణంలో బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించి,తీసుకోవాల్సిన చర్యలు పై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘటనపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు, అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారని అన్నారు.
ఒడిశాకు మంత్రి, ముగ్గురు అధికారులు
పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందాన్ని ఒడిశాకు సీఎం పంపించారని మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. కోరమాండల్ సహా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో ఈ రైళ్లు నిలిచే ఆయా స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామన్నారు.కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని, వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సిన వారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారని తెలిపారు. వీరందరి ఫోన్ నంబర్లకు ఫోన్లుచేసి వారిని ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు.
267 మంది సేఫ్....
రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల్లో 267 మంది సురక్షితంగా ఉన్నారని తేలిందని, 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయన్నారు. 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు వెల్లడైందని చెప్పారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ చేశారని, 113 మంది వివరాలను సేకరించడానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇక హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారని, విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నారని తెలిపారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని,స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారన్నారు. ఇందులో 10 మంది ట్రైను ఎక్కలేదన్నారు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్ అవడమో జరిగిందని, వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు.
అన్ని ఆసుపత్రులు అలర్ట్...
ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకూ కూడా ఆస్పత్రులను అలర్ట్ చేశామని మంత్రులు బొత్స సత్యన్నారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.గాయపడ్డవారు ఎవరు వచ్చినా.. వారికి చికిత్స అందిస్తామని,విశాఖకు చేరుకున్న గాయపడ్డ ప్రయాణికులు ఇద్దరిని వెంటనే సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు.వీరిలో ఒకరి తలకు, మరికొరికి వెన్నుపూసకు గాయం అయ్యిందన్నారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని,ఒడిశాకు 108 అంబులెన్స్‌లు 25, ప్రయివేటు అంబులెన్స్‌లు మొత్తంగా 50 అంబులెన్స్‌లు పంపించినట్లు తెలిపారు.ఇవి కాకుండా ఎమర్జెన్సీ కార్యకలాపాల కోసం ఒక ఛాపర్‌ను కూడా సిద్ధంచేశామన్నారు. అవసరమైతే క్షతగాత్రులను ఎయిర్‌లిఫ్ట్ చేస్తామన్నారు. ఇందుకుగాను నేవీ సహకారాం కూడా తీసుకుంటున్నామని, ఏపీకి చెందిన ప్రయాణికులు చనిపోయారని నిర్ధారిత సమాచారం ఏమీ లేదన్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇంకా ఏమీ నిర్ధారించలేమని తెలిపారు. కాని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని,పేషెంట్లను అవసరమైతే భువనేశ్వర్ అపోలోలో చేర్పించడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు అపోలో ఆస్పత్రితో మాట్లాడామని, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎవరైనా తమ వారి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు.