Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారా ? అసలేం జరిగిందంటే ?
Andhra Pradesh : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ప్రధాన అనుచరుల్ని అరెస్టు చేశారు. వంశీ ఆచూకీ తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.
Vallabhaneni Vamsi Arrested : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసినట్లుగా విస్తృత ప్రచారం జరిగింది. ఆయన కోసం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో గాలించాయి. అయితే ఆయన గన్నవరంలోనే ఉన్నట్లుగా తెలియడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చెప్పుకున్నారు. కానీ ఆయనను అరెస్టు చేయలేదని కాసేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ప్రధాన అనచరులు ఇద్దరు రమేష్, యూసుఫ్ పఠాన్‌లను అరెస్టు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వల్లభనేని వంశీ ఆచూకీ పోలీసులు తెలియలేదని తెలుస్తోంది.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో నిందితుడు
గత ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని కార్లను తగులబెట్టారు. ఆ ఘటన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులే. దాడిని ఆయనే పర్యవేక్షించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. టీడీపీ నేత పట్టాభిరాంను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కృష్ణా జిల్లాకు ఎస్పీగా వచ్చిన గంగాధర్ రావు ఈ కేసు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ గంగాధర్ రావు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఊరందుకున్న దాడి కేసు దర్యాప్తు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై కేసులు పెట్టి అరెస్టు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 71వ నిందితుడిగా వల్లభనేని వంశీని చేర్చారు. ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు. వారంతా జైల్లో ఉన్నారు. వంశీని అరెస్టు చేసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఓడిపోవడం.. తాను కూడా ఓడిపోవడంతో వంశీ ముందు జాగ్రత్తగా విజయవాడ నుంచి వెళ్లిపోయారు. ఆయన అమెరికాలో ఆశ్రయం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది.
వరుసగా వంశీ కీలక అనుచరుల అరెస్టు
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వరుసగా వంశీ కీలక అనుచరుల్ని అరెస్టు చేస్తూ వస్తున్నారు. తాజాగా యూసుఫ్ పఠాన్ అనే ఆయన ప్రధాన అనుచరుడ్ని అరెస్టు చేశారు. దీంతో ఆయననే అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరిగింది. చివరికి ఆయనను కాదని.. ఆయన అనుచరుడ్ని అరెస్టు చేసినట్లుగా గుర్తించారు.
చంద్రబాబు కుటుంబపై దారుణమైన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన ఆయన వైసీపీలో చేరారు. చంద్రబాబు కుటుంబంపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. నారా లోకేష్ కూడా.. గన్నవరం పిల్ల సైకోను వదిలేదని పాదయాత్ర సమయంలోనూ..ఎన్నికల సమయంలోనూ చెప్పారు.