High Way Bundh: హైదరాబాద్-విజయవాడ హైవేపైనా వరద నీరు! నిలిచిపోయిన ట్రాఫిక్
వరద నీటి నుంచి ముందుకు వెళ్లే పరిస్థితి లేక వందల సంఖ్యలో కార్లు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నేషనల్ హైవేపై నిలిచిపోవాల్సి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆగకుండా కురుస్తున్న వర్షానికి కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ఆ వరద నీరు రహదారులపైకి వచ్చి కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా నేడు (జూలై 27) హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పై నుంచి వేగంగా వరద నీరు పారింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ సమీపంలో ఐతవరం అనే గ్రామం సమీపంలో వరద నీరు రోడ్డుపై నుంచి భారీగా ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించినట్లుగా అయింది.
వరద నీటి నుంచి ముందుకు వెళ్లే పరిస్థితి లేక వందల సంఖ్యలో కార్లు, బస్సులు, లారీలు, ఇతర వాహనాలు నేషనల్ హైవేపై నిలిచిపోవాల్సి వచ్చింది. దాదాపు రెండు కిలో మీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయాయి. కొంత మంది రిస్క్ చేసి వాహనాలను పారుతున్న నీటిలో నుంచే పోనిచ్చారు. ఐతవరం దగ్గర పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
NH-65 Vijayawada-Hyderabad at keesara tollplaza
— Bhanu Prathap (@Bhanuprathapp1) July 27, 2023
munneru river😱 pic.twitter.com/ghM5c7mq8Z
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్న సంగతి తెలిసిందే. గతరాత్రి కురిసిన వర్షానికి రెండు రాష్ట్రాల్లో నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు, ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు అధికారులు అప్రమత్తమై, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద మరో రెండు రోజులు వరకు పెరుగున్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కోనసాగుతుందని నీటిమట్టం 47.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.05 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు.
రెండవ ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాల్లో 458 గ్రామాల వరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం 3NDRF, 4 SDRF మొత్తం 7 బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరో వైపు ప్రకాశం బ్యారేజి వద్ద 1.42 లక్షల ఔట్ ఫ్లో ఉందని కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.