Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Vijayawada News: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారీ బోట్లను తొలగించడం కఠినంగా మారింది. దీంతో మరో 2 బోట్ల సాయంతో వీటిని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.
New Plan For Boats Extraction From Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. దాదాపు 7 రోజులుగా వాటిని తొలగించేందుకు సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలాన్నివ్వడం లేదు. బ్యారేజీ గేట్లకు అడ్డంగా చిక్కుకున్న భారీ ఇనుప బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ క్రమంలో బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ ఇంజినీర్లు మరో ప్లాన్ అమలు చేస్తున్నారు. రెండు భారీ పడవలను ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వెలికి తీయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను సైతం ప్రారంభించారు. కాగా, 3 రోజుల క్రితం కాకినాడ నుంచి నిపుణుల బృందం రంగంలోకి దిగి.. గేట్ల వద్ద చిక్కుకున్న 3 బోట్లను నీటిలో నుంచే ఎగువకు తీసుకెళ్లాలని భావించినా వీలు కాలేదు.
ఆదివారం దుర్గాఘాట్ వైపు పొక్లెయిన్లు పెట్టి భారీ ఇనుప రోప్స్‌తో లాగేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అధికారులు, నిపుణులు బోట్ల వెలికితీతకు మరో ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కటి 50 టన్నుల సామర్థ్యం గల రెండు బోట్లను తెప్పించి వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు. క్రేన్ల సాయంతో వాటిని బయటకు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది సత్ఫలితాన్నిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఇదీ జరిగింది
ఈ నెల 2న ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి వచ్చిన క్రమంలో 4 బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. దీంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. దీంతో మరమ్మతులు చేపట్టిన ఇంజినీరింగ్ నిపుణులు.. రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో 5 రోజుల్లోపే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. అయితే, బోట్లు తొలగించే ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు. తొలుత బోట్లను కోసి వాటిని భాగాలుగా చేసి ఒడ్డుకు చేర్చాలని భావించారు. అయితే, అది సాధ్యం కాలేదు. గత 6 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో భారీ పడవలు, క్రేన్ల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చేలా ప్రణాళిక రచిస్తున్నారు.
కుట్రకోణం.?
అయితే, వరదల సమయంలో బ్యారేజీని బోట్లు ఢీకొనడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. డ్యాంను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు ప్రకాశం బ్యారేజీని మరో రెండు బోట్లు ఢీకొన్నట్లు చెప్పారు. ఆ బోట్లు ఉషాద్రి, కర్రి నరహింహా స్వామి, గూడూరు నాగమల్లీశ్వరిలకు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా మూడింటిని కలిపి కట్టరని.. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని నివేదికలో వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది.
Also Read: Amalapuram: కలెక్టరేట్ సమీపంలో భారీ పేలుడు - రెండంతస్తుల భవనం ధ్వంసం, భయాందోళనకు గురైన ప్రజలు