Andhra Pradesh: విజయసాయిరెడ్డితో ఏ సంబంధం లేదు, కావాలనే రోడ్డుకు లాగుతున్నారు: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి
Andhra Pradesh News | దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. వాటిపై ఆమె స్పదిస్తూ విజయసాయిరెడ్డితో తనకు ఏ సంబంధం లేదన్నారు.
Endowment Assistant Commissioner Shanthi on VijayaSai Reddy | అమరావతి: వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డుకు లాగుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్టు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆమె పనిచేస్తున్న దేవదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు. రెండు రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో, తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు.
కావాలనే రోడ్డుకు లాగుతున్నారు: శాంతి
తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్ మోహన్ తో 2013లో వివాహం జరిగిందని తాను హిందవు కాగా, మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో తనను మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్దమనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్టు శాంతి స్పష్టం చేశారు. బాండ్ పేపర్ పై ఇద్దరం విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు ఇద్దరు కవల ఆడ పిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లను చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని.. విడాకులు తీసుకున్నా తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. తన పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో వారికోసం తాను మదన్ మోహన్ పెట్టే బాధలు భరించినట్టు చెప్పుకొచ్చారు.
శాంతి తనకు 2020లో ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత వేరే అధికారి వేధింపుల నుంచి కాపాడిన సుభాష్ అనే లాయర్ ను వివాహం చేసుకున్నట్టు శాంతి వెల్లడించారు. ప్రస్తుతం వివాదాన్ని ఎదుర్కొంటున్న బిడ్డ ఆయనకే పుటినట్లు వివరించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో కోర్టు నుంచి కూడా విడాకులు తీసుకునేందుకు మదన్ మోహన్, తాను అప్లై చేసినట్టు చెప్పారు. అయితే ఈలోపు తాను అక్రమంగా 100 కోట్లు సంపాదించినట్టు ఒక పత్రిక కథనాలు రాయడంతో అది నిజమని నమ్మి, తనకు 70 కోట్లు ఇవ్వాలంటూ మదన్ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపు చర్యల్లో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు అక్రమ సంబంధం అంటగడుతూ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని శాంతి ఆరోపించారు
అక్కడే విజయసాయిరెడ్డితో పరిచయం
తాను వైజాగ్ లో పనిచేస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసేవారనీ, వైజాగ్ లోని దేవదాయశాఖ పరిధిలోని ప్రేమ సమాజం సంస్థకు చెందిన 30 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న ఒక రిసార్ట్ ఏళ్ల తరబడి కేవలం 5 లక్షలే చెల్లించేది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం లీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడానికి ఎంపీ విజయసాయిరెడ్డిని తొలిసారి కలిశానని శాంతి అన్నారు. అనంతరం ప్రేమ సమాజం సంస్థకు రూ.25 లక్షల వరకూ లీజ్ మనీ వచ్చిందని తెలిపారు. ఆ పనిమీదే ఒక్కసారి ఎంపీ విజయసాయిరెడ్డిని తాను కలిశానని, కానీ అంత మాత్రాన తనకు, ఎంపీకి సంబంధం అంట గట్టేస్తారా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి వయసు ఏంటి, కూతురు వయసున్న తనతో సంబంధం ఏంటని కూడా చూడరా అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఇదే విషయంపై సోమవారం ఉదయం వైజాగ్ లో తాను మీడియా ముందుకు రానున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.
శాంతిపై మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు
అమరావతి: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఏపీ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య శాంతి గర్భం దాల్చిందని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని మదన్ మోహన్ అనుమానం వ్యక్తం చేశారు. శాంతి అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ మదన్ మోహన్ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. కాగా, దేవదాయ శాఖ కమిషనర్ ఇటీవల శాంతిని సస్పెండ్ చేశారు. మదన్ మోహన్ చేసిన ఆరోపనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి.