AP Elections 2024: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్‌పై వేటు - ఎన్నికల సంఘం కఠిన చర్య
AP Latest News in Telugu: ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇదే సస్పెన్షన్ కు కారణమైంది.
AP Elections News: ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన్ను సస్పెన్షన్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన తన హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి కొద్ది రోజుల క్రితం ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి.. వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. కడప జిల్లా కలెక్టర్ ను ఈ విషయంపై నివేదిక కోరింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ పై చర్యలు తీసుకుంది.