East Godavari: అమ్మ మొక్కు కోసం భిక్షాటన, కొప్పవరంలో రియల్ బిచ్చగాళ్లు
అందరూ సమానమే అన్న భావనే సత్తెమ్మ తల్లి జాతరలో విచిత్ర వేషధారణలకు కారణం అంటున్నారు కొప్పవరం గ్రామస్తులు. సత్తెమ్మ తల్లికి మొక్కుకుంటే రెండేళ్లలో కోరిన కోర్కెలు నెరవేరతాయని అంటున్నారు.
ఎంతటి వారైనా ఈ ఒక్కరోజు మాత్రం బిచ్చగాళ్లుగా మారిపోతారు. అపర కుబేరులైనా, రాజకీయ ఉద్దండులైనా, డాక్టర్ అయినా యాక్టర్ అయినా మొక్కుకున్నవారందరు బిక్షాటన చేస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వింత ఆచారాన్ని చూడాలంటే తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలోని అనపర్తి(Anaparthi) నియోజకవర్గంలోని కొప్పవరం(Koppavaram) గ్రామానికి వెళ్లాల్సిందే.
సత్తెమ్మ జాతర(Sattemma Jatara)
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజవర్గం కొప్పవరం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సత్తెమ్మ(Sattemma) జాతరను పురస్కరించుకుని ఆ గ్రామస్తులు చిత్రవిచిత్రాల వేషధారణలతో తమ మొక్కులు తీర్చుకుంటారు. చిత్ర విచిత్ర వేషధారణలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతటి హోదాలో ఉన్నా ఎంతటి కుబేరులు అయిన, అమ్మవారి మొక్కు చెల్లించుకునేందుకు బిక్షాటన చేస్తారు. మొక్కులు చెల్లింపునకు బిక్షాటన సంబంధం ఏంటంటే కొప్పవరం గ్రామంలో వెలసిన సత్తెమ్మ తల్లి కోరుకున్న కోరికలు తీర్చే దేవతగా పేరుంది. అది కూడా రెండు సంవత్సరాల్లో ఆ కోరికలు తీరడం ఇక్కడి ప్రత్యేకత.
మొక్కులు తీర్చుకునేందుకు వేషధారణలు(Costumes)
ఇలా కోర్కెలు తీరిన భక్తులు చిత్ర, విచిత్ర వేషధారణలతో జాతర రోజున కొప్పవరం గ్రామంలో బిక్షాటన చేసి వచ్చిన సొమ్మును, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కుబడులను చెల్లించుకుంటారు. దీని వెనుక ప్రతి ఒక్కరూ సమానమేనని భావన ఉందని గ్రామస్తులు నమ్ముతారు. ఏ కులమైనా, ఏ మతమైనా అందరం సమానమేనని ఎదుటివారిని గౌరవించాలని, మనం వచ్చేటప్పుడు ఏమి తేలేదని పోయేటప్పుడు ఏమి తీసుకుపోమనే భావనతో ఇలా చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యలో వచ్చిన హోదాలతో మితిమీరి వ్యవహరించరాదని సందేశం ఉందంటారు. అంతేకాదు మొక్కులు మొక్కుకున్నప్పుడే పలానా వేషధారణలో సన్నిధికి వస్తామని మొక్కు కుంటారు. ఇక జాతర రోజున ఆ వేషధారణలో ముస్తాబై అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. జాతర సందర్భంగా విచిత్ర వేషధారణలతో కొప్పవరం గ్రామస్తులు చేసిన సందడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
పూజారి బడితె పూజ
కొప్పవరం సత్తెమ్మ పూజారి బడితె పూజ తల్లి జాతరలో భాగంగా ఆదివారం అమ్మవారు నాగదేవతగా దర్శనమిచ్చారు. మేళతాళాల నడుమ అమ్మవారికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో వివిధ రకాల వేషధారణలో పెద్ద ఎత్తున భక్తులు సందడి చేశారు. ఆచారంలో భాగంగా కొప్పవరంలోని పుట్ట వద్ద పూజలు చేసి తిరిగి ఆలయానికి చేరుకున్న పూజారులను ఆలయంలోకి వెళ్లకుండా విచిత్ర వేషధారణలో ఉన్న భక్తులు అడ్డుకుంటారు. భక్తులకు పూజారి బడిత పూజ చేశాడు. పూజారితో దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం పొందినట్లేనని భక్తులు నమ్ముతారు. బడితె పూజ చేయించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. విచిత్ర వేషధారణలు, భక్తుల పూజలు, పూజారి బడిత పూజ, బాణాసంచా కాల్పులతో సత్తెమ్మ తల్లి జాతర వైభవంగా సాగింది.