East Godavari News : ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వ పథకాలు బంద్, అమలాపురంలో అధికారుల అత్యుత్సాహం!
East Godavari News : ఏపీలో పన్ను వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. ఇంటి పన్ను కట్టలేదని ఇంటికి తాళాలు వేసిన ఘటన మరువక ముందు తూ.గో జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.
East Godavari News : ఏపీలో ఇంటి పన్ను, ఆస్తి పన్ను(Property Tax), చెత్త పన్ను కట్టకపోతే మీ పని అంతే. మీ ఇంటికి తాళం వేసేస్తారు లేదా ఇంటి ముందు పెద్ద చెత్త కుప్ప పెడతారు లేదా కుళాయి కనెక్షన్, ప్రభుత్వ పథకాలు(Govt Schemes) బంద్ అయిపోతాయి. ఇవేవో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. స్వయంగా ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు చెబుతున్న సత్యాలు. మొన్న తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) పిఠాపురంలో ఇంటి పన్ను కట్టలేదని ఇంటికి తాళం వేశారు అధికారులు. కాకినాడ(Kakinada)లో ఇంటి పన్ను కట్టకపోతే మీ ఇంట్లో వస్తువులు నిరభ్యంతరంగా పట్టుకుపోతామని ఫ్లెక్సీ వేసి ప్రచారాలు కూడా చేశారు. కర్నూలులో కూడా చెత్త పన్ను కట్టలేదని చెత్త తెచ్చి షాఫింగ్ కాంప్లెక్స్ ముందు పారబోశారు. కర్నూలు మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకు వేసి పింఛన్లలో చెత్త పన్ను మినహాయింపు చేసి ఇవ్వాలని మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
పన్ను కట్టకపోతే పథకాలు బంద్
తూర్పు గోదావరి జిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది. ఇంటి పన్ను, ఆస్తి పన్ను బకాయిలు కట్టకుంటే కుళాయి కనెక్షన్(Water Connection) కట్ చేస్తూ, ఇంటికి తాళాలు వేస్తున్న అధికారుల తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా అవేమీ పట్టించుకోవడం లేదు. తమకు నచ్చిన పద్ధతుల్లో తమకు తోచిన విధంగా చేసుకుపోతున్నారు. పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి(Rajahmundry)లో అధికారుల వ్యవహారం మరువకముందే అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం రూరల్ మండలం కామనగరువు పంచాయతీ కార్యదర్శి మరో వివాదానికి తెరలేపారు. ఆటోకి మైక్ సెట్ కట్టి ఈ నెల 27 లోపు ఇంటి పన్నులు చెల్లించని పక్షంలో ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని, ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తూ గ్రామంలో ప్రచారాలు చేయించడం మరో వివాదానికి తెరలేపింది. దీనిపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఈ పరిస్థితులు చూడలేదని పన్నులు కట్టడం కొంచెం ఆలస్యమైనంత మాత్రాన ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని, సరిపడా ఆస్తులు జప్తు చేస్తామని బెదిరించడం ఎంతవరకు సబబని మండిపడుతున్నారు.
పిఠాపురంలో ఇంటికి తాళం
ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకోసం పన్నుల వసూళ్లకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా పన్నులు కట్టకోపతే ఇంట్లోని వస్తువులను జప్తు చేస్తామనే హెచ్చరికలతో వాహనాలలో ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల మంచి నీటి కనెక్షన్లు కూడా కట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జిల్లా పిఠాపురం అధికారులు మరింత దూకుడుగా వెళ్లి పన్నులు కట్టలేదని మనుషుల్ని ఇంట్లో ఉంచి తాళం వేశారు. పిఠాపురం పట్టణంలోని 15వ వార్డులో ఇంటి పన్ను కట్టలేదని పలు ఇళ్లకు తాళాలు వేశారు. లోపల మనుషులు ఉన్నా అధికారులు పట్టించుకోకుండా తాళాలు వేశారు. పన్నులు చెల్లించకపోతే నెలవారి వచ్చే పెన్షన్లలో కోత విధిస్తామని బాధితులను వలంటీర్లు, సచివాలయ సిబ్బంది బెదిరిస్తున్నారని పింఛన్ దారులు ఆందోళన చెందుతున్నారు.