Deputy CM Pawan Kalyan: పోలీసుల పనితీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం - 'హోం' టార్గెట్‌గా మారుతున్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు?
Pawan Kalyan: పోలీసుల పనితీరుపై పవన్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో కొంత మంది నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

Deputy CM Pawan Kalyan once again targets the Home Ministry: గురువారం జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీసు వ్యవస్థపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కొంత మంది వచ్చి దాడి చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు. వృద్ధి రేటు సాధించడానికి లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమన్నారు. గతంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో స్మగ్లింగ్, గంజాయి రవాణా , శాంతిభద్రతల అంశాలను ప్రస్తావించారు. అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తే సామాన్యుడు ఎవరి వద్దకు వెళ్తాడు?" అని నిలదీశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా స్మగ్లింగ్ ఆగకపోవడంపై ఆయన పోలీసు ఉన్నతాధికారుల బాధ్యతను ప్రశ్నించారు.
గతంలోనూ హోంశాఖ పని తీరుపై విమర్శలు
పవన్ కల్యాణ్ ప్రధానంగా పోలీసు శాఖలోని 'నిర్లిప్తత'ను ఎండగడుతున్నారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన పద్ధతులను ఇంకా కొందరు అధికారులు పాటిస్తున్నారని, నిందితుల అరెస్టు విషయంలో కులమతాలను చూడటం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పాత ధోరణిలోనే ఉండటాన్ని ఆయన సహించలేకపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై వస్తున్న అసభ్యకర పోస్టుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఎందుకు ఈ వ్యూహాత్మక విమర్శలు?
పవన్ కల్యాణ్ ఇలా సొంత కూటమిలోని హోంశాఖను టార్గెట్ చేయడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవడంలో పోలీసులు విఫలమైతే, ఆ నింద మొత్తం కూటమి ప్రభుత్వంపై పడుతుందనే ఆందోళన. రెండోది, ప్రశ్నించే గొంతుకగా తన 'జనసేన' ఇమేజ్‌ను కాపాడుకుంటూనే, పరిపాలనలో చురుకైన మార్పులు తీసుకురావాలని అధికారులపై ఒత్తిడి పెంచడం అని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
పవన్ వ్యాఖ్యలను సూచనలుగా భావిస్తున్నహోంమంత్రి
కలెక్టర్ల సదస్సులో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. తాను కేవలం పంచాయతీరాజ్ మంత్రిని మాత్రమే కాదు, రాష్ట్ర బాధ్యత ఉన్న డిప్యూటీ సీఎంని అనే సంకేతాన్ని ఆయన బలంగా పంపారు. పోలీసు వ్యవస్థలో మార్పు రాకుంటే పవన్ కల్యాణ్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ సూచనలను హోంమంత్రి పాజిటివ్ గా తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కు అలా సూచించే అధికారం ఉందని అంటున్నారు.





















