Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
Andhra News: ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Pawan Kalyan Happy With TTD Decision: తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో సోమవారం టీటీడీ (TTD) తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తిరుపతి ప్రజలకు ఇది ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. 'ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తిరుపతి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి ఆకాంక్షను నెరవేర్చాలని టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లాను. నా సూచనపై నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యులకు అభినందనలు. టీటీడీ పవిత్రతను రక్షించేలా చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు.' అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి నిర్ణయం హర్షణీయం - ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు#TTD pic.twitter.com/EY9Vad4qLZ
— JanaSena Party (@JanaSenaParty) November 18, 2024
'2, 3 గంటల్లోనే దర్శనం'
భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం 2, 3 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని చెప్పారు. 'అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ. తిరుమలలో రాజకీయాలు పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎవరైనా ఆ విషయాలు మాట్లాడితే కేసులు. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం. మెనూలో పదార్థాన్ని అదనంగా జోడిస్తాం. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం. టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం. తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం.' వంటి నిర్ణయాలను పాలకమండలి తీసుకుంది.
అటు, 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామన్న టీటీడీ నిర్ణయంతో తిరిగి 'కంకణం' విధానం తిరిగి అమలు చేస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా, 2 దశాబ్దాల కిందట టీటీడీ ఈవోగా ఐవీ సుబ్బారావు ఉన్న సమయంలో ఈ విధానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతీ భక్తుడి చేతికి రిస్ట్ బాండ్ తరహాలో ఓ కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఇది వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది. దీని ద్వారా భక్తులు వారికి కేటాయించిన సమయానికి వెళ్లి 2, 3 గంటల్లోనే స్వామి దర్శనం చేసుకుని రావొచ్చు.
Also Read: Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!