(Source: Poll of Polls)
MP Raghu Rama : ఎంపీ రఘురామ ఫోన్ ట్యాపింగ్ , ఏపీ ప్రభుత్వానికి నోటీసులు!
MP Raghu Rama : ఏపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందని ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. 15 రోజుల్లో సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
MP Raghu Rama : ఏపీ ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రఘురామ ఫిర్యాదును కేంద్ర హోంశాఖ స్పీకర్ కార్యాలయం పంపింది. దర్యాప్తు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం హోంశాఖను కోరింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఫిర్యాదుపై లోక్‌సభ కార్యాలయం కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. తన రెండు సెల్ ఫోన్లు ట్యాపింగ్ చేసి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈనెల 8న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదుచేశారు. రఘురామ ఫిర్యాదుపై స్పందించిన లోక్‌సభ కార్యాలయం 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, కేంద్ర హోంశాఖకు నోటీసులు పంపింది. లోక్‌సభ స్పీకర్ అనుమతితో ఈ నోటీసులు పంపుతున్నట్టు లోక్ సభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుపై వివరాలు అందించాలని ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు పంపారు లోక్‌సభ అధికారులు. ప్రభుత్వం ఇచ్చే వివరణను ఫిర్యాదుదారుకు ఇచ్చేందుకు అంగీకరిస్తారో లేదో కూడా సమాధానం చెప్పాలని కోరింది.
రెబల్ ఎంపీ
వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు రెబల్ జెండా ఎగరేశారు. ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో సీఐడీ అధికారులు ఆయనను గతంలో అరెస్టు చేశారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని అప్పట్లో ఎంపీ రఘురామ ఆరోపించారు. ఇటీవల భీమవరంలో ప్రధాని మోదీ పర్యటకు హాజరయ్యేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వస్తున్న తనను సీఐడీ అధికారులు ఫాలో అవుతున్నారని, తన అనుచరులను అదుపులోకి తీసుకుని హింసిస్తున్నారని రఘురామ ఆరోపించారు. అందుకే తన పర్యటన రద్దు చేస్తున్నానన్నారు. దిల్లీలో ఉంటున్న రఘురామ తరచూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నిత్యం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లు పెడుతుంటారు. రుషికొండ తవ్వకాలపై కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంత ఉత్తర్వులపై జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి అంగుళం భూమి విషయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వేచిచూడాలని రఘురామ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అలాగే సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలని ఎంపీ రఘురామ కోర్టులను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణలు కొనసాగుతున్నాయి.