CM Jagan on AP Capital: ఏపీ రాజధాని విశాఖపట్నమే, త్వరలోనే నేనూ షిఫ్ట్ అవుతున్నా - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మాట్లాడుతూ చెప్పారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని ఢిల్లీలో ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సులో మాట్లాడుతూ స్వయంగా చెప్పారు. ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఈ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. కాబట్టి, పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. మార్చి 3, 4 తేదీల్లో ఇన్వెస్టర్ల సదస్సు విశాఖపట్నంలోనే జరగనుందని జగన్ చెప్పారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమలు పెట్టుకొనేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించడానికైనా తాను సిద్ధమని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్ల నుంచి నెంబర్ వన్‌గా ఉంటూ వస్తోందని జగన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్‌లలో మూడు ఏపీకే వస్తున్నాయని తెలిపారు.
ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధానిగా మారుతోందని, రాబోయే కొద్ది నెలల్లోనే తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని సీఎం జగన్ తెలిపారు.