Chandrababu Warning: రోజల తరబడి ఫైళ్లు క్లియర్ చేయకపోవడం ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే - అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
IAS Officers Performance: అమరావతిలో ఫైళ్ల క్లియరెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష. కలెక్టర్ల సదస్సుకు హాజరుకాని అధికారులపై ఆగ్రహం. నెల రోజుల్లో 100% ఆన్లైన్ ఫైళ్ల నిర్వహణకు డెడ్‌లైన్ పెట్టారు.

Andhra Pradesh Secretariat collectors conference: అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా వేగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఫైళ్ల క్లియరెన్స్‌లో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. సరైన సమయంలో ఫైళ్లను క్లియర్ చేయకపోవడం వల్ల ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయని అధికారులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. పాలనలో పారదర్శకత, వేగం ఉండాలని పదేపదే చెబుతున్నప్పటికీ అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఎంతో ప్రాధాన్యత కలిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సుకు కూడా కొందరు ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమీక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల ధైర్యం ఏంటో అర్థం కావడం లేదని నిలదీశారు. కాన్ఫరెన్సుకు గైర్హాజరైన అధికారులందరి నుంచి వెంటనే రాతపూర్వక వివరణ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారుల పనితీరును అంచనా వేసే ఐఏఎస్ అధికారుల 360 డిగ్రీల నివేదికను అందరి అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకుని పక్కాగా తయారు చేస్తామని హెచ్చరించారు.
ఫైళ్ల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. అదే సమయంలో జీరో డే లోనే ప్రాసెస్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు అందజేశారు. అయితే, కొన్ని శాఖల్లో ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు కూడా 4 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని, వారు మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్యదర్శులు కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు.
పరిపాలనను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా సీఎం చంద్రబాబు కీలక గడువు విధించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు రాబోయే నెల రోజుల్లోగా 100 శాతం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇకపై ఎక్కడైనా మాన్యువల్ ఫైళ్లు రన్ చేస్తే దానిని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణ విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని, మంత్రులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వేగవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందులో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఆధారంగా అధికారుల పెర్ఫార్మెన్స్ను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పటికైనా మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వేగంగా ప్రజలకు చేరేలా చూడాలని సదస్సు వేదికగా సీఎం ఆదేశించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















