తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకలను, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకలను జరుపుకున్నాయి. ఈ రెండు సంస్థలు సుదీర్ఘకాలంగా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయి.
CM Chandrababu: వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
East Godavari District | తూర్పుగోదావరి జిల్లా కోర్టు, రాజమండ్రి బార్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, న్యాయవ్యవస్థ సేవలు, పోలవరం, గోదావరి పుష్కరాలు, లీగల్ ఏఐ స్టాక్‌పై ప్రసంగించారు.

- చంద్రబాబు కోర్టు వేడుకల్లో పాల్గొని, రాజమహేంద్రవరం చారిత్రక ప్రాముఖ్యత వివరించారు.
- పోలవరం పూర్తి, గోదావరి పుష్కరాలకు న్యాయమూర్తులందరినీ ఆహ్వానించారు.
- ప్రకాశం, కోకా సుబ్బారావు సేవలు; జస్టిస్ మిశ్రా తీర్పును కొనియాడారు.
- న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగం, వేగవంతమైన కేసుల పరిష్కారం లక్ష్యమన్నారు.
రాజమహేంద్రవరం ఒక చారిత్రక ప్రదేశమని, ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి మహోన్నతులు ఈ ప్రాంతాన్ని పునీతం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. ఆర్థర్ కాటన్ లాంటి వారు బ్యారేజి కట్టి ఉభయగోదావరి జిల్లాల డెల్టాను సస్యశ్యామలం చేసి, ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా మార్చారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి అవుతోందని, గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు. సీఎంగా మూడోసారి ఈ వేడుకను నిర్వహించే భాగ్యం తనకు దక్కిందన్నారు. సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులందరినీ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించాలని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకలు, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకల్లో సీఎం చంద్రబాబు శనివారం నాడు పాల్గొని ప్రసంగించారు. 222 ఏళ్లు పూర్తి చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు, 131 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజమండ్రి బార్ అసోసియేషన్‌కు అభినందనలు తెలియజేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కోర్టులు సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ లాగే రాజకీయ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ కూడా ప్రజల హక్కుల కోసం అదే స్థాయిలో పనిచేస్తోందన్నారు.
బ్రిటీషు వారికి గుండె చూపిన ధైర్యశాలి ప్రకాశం పంతులు
టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి న్యాయవాదులు స్వాతంత్ర్య సమరయోధుడిగా బ్రిటీష్ వారికి గుండెలు చూపించిన ధైర్యశాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు 9వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రజాకోర్టుగా పేరున్న సీతానగరం రచ్చబండ కోర్టు 1849లోనే అధికారిక కోర్టుగా పేరు పొందినట్లు గుర్తుచేశారు. తాటి చెట్ల ఆకుల తీర్పు ప్రతుల నుంచి ఏఐ వరకూ న్యాయ వ్యవస్థ రూపాంతరం చెందిందని వివరించారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని, అప్పటి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పు ఏపీని, అమరావతిని కాపాడిందని చంద్రబాబు అన్నారు. ఏపీకి తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రపుటల్లోకి ఎక్కారని పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కూడా త్వరలోనే అమలయ్యే అవకాశం ఉందన్నారు.
న్యాయం అందరికీ చేరువగా ఉండాలనే మన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని, లోక్ అదాలత్ లాంటి వ్యవస్థల వల్ల, సాంకేతికత వల్ల న్యాయాన్ని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సంక్షోభంలో ఉన్నా భారత్ మాత్రం స్థిరంగా ఉందని, ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన నాలుగు స్తంభాలు పటిష్టంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషించారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్‌గా, ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
సాంకేతికత, లీగల్ ఏఐ స్టాక్, వేగవంతమైన కేసుల పరిష్కారం
‘పౌరపాలనలో కూడా ఏఐ లాంటి సాంకేతికత ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. పన్ను వసూళ్లలో ఏఐ లాంటి వ్యవస్థలతో మెరుగైన ఫలితాలను కూడా రాబడుతున్నాం. లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్మెంట్ కోసం లీగల్ ఏఐ స్టాక్‌ను కూడా త్వరలోనే అమలు చేయాలని నిర్ణయించాం. ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 8.4 లక్షల కేసుల నిర్వహణ చేస్తున్నాం.
లీగల్ ఏఐ స్టాక్ ద్వారా యూనిఫైడ్ డిజిటల్ లా డిపాజిటరీ, రూల్స్, జీఓలు, కేస్ రికార్డులను, ఏఐ కేస్ అనాలసిస్, కౌంటర్ అఫిడవిట్స్ లాంటివి తయారు చేసేలా చూస్తున్నాం. ఆర్బిట్రేషన్, మీడియేషన్ లాంటి విధానాలను కూడా త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు వినియోగిస్తున్నాం. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వం కూడా ఒక ప్రతివాదిగా ఉంటోంది. కోర్టుల సహకారంతో ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం కల్పించాలన్నది మా ఆలోచన. రాజ్యాంగం పేర్కొన్న విలువలను కాపాడుతూ, సమయానికి ప్రజలకు న్యాయం చేకూర్చేలా మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని’ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
Frequently Asked Questions
తూర్పుగోదావరి జిల్లా కోర్టు, రాజమండ్రి బార్ అసోసియేషన్ ఎన్ని ఏళ్ల వేడుకలను జరుపుకున్నాయి?
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? గోదావరి పుష్కరాల గురించి ఏమి చెప్పారు?
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తవుతుంది. గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయని, ముఖ్యమంత్రిగా మూడోసారి ఈ వేడుకను నిర్వహించే భాగ్యం తనకు దక్కిందని చంద్రబాబు తెలిపారు.
రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి ప్రసిద్ధి చెందిన న్యాయవాదులు ఎవరు?
రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, జస్టిస్ కోకా సుబ్బారావు లాంటి 9వ భారత ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు.
న్యాయ వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టనున్న సాంకేతిక విధానాలు ఏమిటి?
ప్రభుత్వం త్వరలో లీగల్ ఏఐ స్టాక్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇది యూనిఫైడ్ డిజిటల్ లా డిపాజిటరీ, ఏఐ కేస్ అనాలసిస్ వంటి వాటికి సహాయపడుతుంది.
ట్రెండింగ్ వార్తలు























