Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Mithun Reddy: ఆంధ్రప్రదేస్ లిక్కర్ స్కాంలో ఎనిమిది గంటల పాటు మిథున్ రెడ్డిని సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. విచారణ తర్వాత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడలేదు.

CID police questioned Mithun Reddy: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సీఐడీ సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసిన తర్వాత న్యాయవాదితో కలిసి మిథున్ రెడ్డి శనివారం సిట్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గతంలో ఆయన తాను ఎంపీనని లిక్కర్ పాలసీతో సంబంధం లేదని వాదించారు. అయితే విజయసాయిరెడ్డి తన ఇంట్లో లిక్కర్ పాలసీలపై రెండు సమావేశాలు జరిగాయని వాంగ్మూలం ఇచ్చారు. రెండు సార్లు లిక్కర్ పాలసీపై జరిగిన చర్చల్లో మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రాజ్ కసిరెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్య రాజ్ లతో మద్యం పాలసీపై ఎందుకు చర్చించాల్సి వచ్చిందని సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఆదాన్ డిస్టిలరీ, డీకార్ట్ కు ఆర్థిక లావాదేవీలపైనా ప్రశ్నించారు. ఆధారాలతో సహా ఆయన ముందు కొన్ని పత్రాలు పెట్టి అడిగినట్లుగా తెలుస్తోంది. లాయర్ దూరంగా కూర్చుని ఉండగా సిఐడీ సిట్ అధికారులు ప్రశ్నించారు ఈ స్కాం వ్యవహారంలో పోలీసులు అన్ని ఆధారాలను ముందు పెట్టుకుని నిందితుల్ని విచారణకు పిలుస్తున్నారు. విచారణ మొత్తం రికార్డు చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా బుకాయిస్తున్నారని చెప్పేందుకు రికార్డు చేస్తున్నారు. మిథున్ రెడ్డిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాగానే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
సాయిరెడ్డి బట్టే బాజ్ : రాజ్ కసిరెడ్డి
మరో వైపు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఓ ఆడియో టేప్‌ను రిలీజ్ చేశారు. మద్యం కుంభకోణంలో తన పేరు పదే పదే ప్రస్తావిస్తున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాజ్ కసిరెడ్డి విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ అన్నారు. విజయసాయి చరిత్రను అందరి ముందు పెడతానని హెచ్చరించారు. లిక్కర్ కేసులో తనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలన్నారని తెలిపారు. నోటీసులపై 24 గంటల్లోనే తాను స్పందించానని, తనను ఎందుకు రమ్మంటున్నారని అడిగానని వెల్లడించారు. ఏమైనా డాక్యుమెంట్స్ తేవాలా అని అడిగినట్లు పేర్కొన్నారు. విచారణకు తాను సహకరిస్తానని చెప్పానని, ఈ మెస్సేజ్ పెట్టాక రెండో నోటీసు ఇచ్చారని తెలిపారు. . సాక్షిగా తనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని లాయర్లు చెప్పారు. తనకు వచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశానన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశానన్నారు. న్యాయ సలహా తీసుకున్నాక విచారణకు వస్తానని రాజ్ కసిరెడ్డి ఆడియోలో తెలిపారు.
రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో తనకు కూడా తెలియదని ఆయన తండ్రి పోలీసులుక చెబుతున్నారు. మరో వైపు ఆయన హైదరాబాద్‌లోనే ఆజ్ఞాతంలో ఉండి ఆడియోలు రిలీజ్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.





















