Brides Wanted: మగాడిగా పుట్టడమే శాపమా ? - పెళ్లి సంబంధాల కోసం ఫ్లెక్సీలు వేసుకోవాల్సి వస్తోంది !
Chittor banner: పండగలు వస్తున్నాయి..పోతున్నాయి...కానీ తమ జీవితాల్లోకి పెళ్లి పండుగ రావడం లేదని ఆ ఊరి యువత బాధపడ్డారు. పరిష్కారం కోసం ఫ్లెక్సీ మార్గం ఎంచుకున్నారు.

Brides Wanted Flexi: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాల వేళ ఒక గ్రామంలో వెలిసిన వినూత్న బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి కోసం అల్లాడిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతున్న సమస్యను ఈ ఫ్లెక్సీ అద్దం పట్టింది.
సాధారణంగా పండుగ వచ్చిందంటే రాజకీయ నాయకుల శుభాకాంక్షలు, సినిమా హీరోల భారీ కటౌట్లు పల్లెల్లో దర్శనమిస్తాయి. కానీ, ఈ ఏడాది చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లిలో సీన్ రివర్స్ అయింది. మా ఊరిలో మంచి కుర్రాళ్ళు ఉన్నారు.. వధువులు కావలెను అంటూ పెళ్లికాని యువకులంతా కలిసి ఒక భారీ ఫ్లెక్సీని ఊరి నడిబొడ్డున ఏర్పాటు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, పచ్చని పొలాలున్న రైతులు ఇలా అందరూ ఉన్నా.. తమకు పిల్ల దొరకడం లేదంటూ వారు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా, దీని వెనుక ఉన్న సామాజిక సమస్య మాత్రం చాలా గంభీరమైంది.
వరకట్నం రివర్స్ ట్రెండ్
ఒకప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నం ఇచ్చుకోలేక ఇబ్బంది పడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మగపిల్లల వైపు నుంచి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, అబ్బాయి ఎంత సంపాదిస్తున్నా.. అమ్మాయిల వైపు నుంచి వస్తున్న డిమాండ్లు, ముఖ్యంగా సామాజికంగా వస్తున్న మార్పులు పెళ్లిళ్లను అసాధ్యం చేస్తున్నాయి. డబ్బు, నగలు కాదు.. వ్యక్తిత్వం ముఖ్యం అంటూ ఆ బ్యానర్‌లో ఉన్న నినాదం నేటి వివాహ వ్యవస్థలోని వ్యాపార ధోరణికి చెంపపెట్టులా ఉంది. లక్షల కట్నం అడిగే రోజులు పోయి, ఇప్పుడు పిల్లని ఇస్తే చాలు మహానుభావా" అని అడిగే రోజులు వచ్చాయని ఈ బ్యానర్లు సెటైరికల్‌గా చాటిచెబుతున్నాయి.
వధువుల కొరత తీవ్రం !
గ్రామాల్లో యువతకు పెళ్లిళ్లు కాకపోవడానికి లింగ నిష్పత్తి లో తేడాలు ఒక కారణమైతే, అమ్మాయిల ఆలోచనా విధానంలో మార్పు మరో ప్రధాన కారణం. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు వ్యవసాయం చేసే అబ్బాయిలకో లేక పల్లెటూరిలో ఉండే వారికో మొగ్గు చూపడం లేదు. సిటీ లైఫ్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఉంటేనే ఓకే అంటున్నారు. దీంతో పల్లెల్లో ఎంతో ఆస్తి ఉన్నా, కష్టపడే తత్వం ఉన్నా యువకులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గానే మిగిలిపోతున్నారు. ఈ సమస్య తీవ్రతను కళ్ళకు కట్టినట్లు చూపించడానికే సంక్రాంతి జాతరను వేదికగా చేసుకుని యువత ఈ సాహసం చేసింది.
వైరల్ అవుతున్న ఆవేదన
ఈ వినూత్న ప్రయోగంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీ బాధ వర్ణనాతీతం" అని కొందరు కామెంట్ చేస్తుంటే, ఒకప్పుడు పెళ్ళంటే నూరేళ్ళ పంట అనేవారు, కానీ ఇప్పుడు అది నూరేళ్ల వెతుకులాట గా మారిందన్నది జగమెరిగిన సత్యం. ఇది ఒక్క ఊరి యువత బాధే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అదే సమస్య ఉంది. అందుకే ఇది తమ సమస్యేనని అందరూ ఫీలవుతున్నారు.


















