Chittoor News : పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్, 200 మందికి పైగా అస్వస్థత
Chittoor News : చిత్తూరు జిల్లాలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు.
Chittoor News : చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో పెళ్లి విందులో పుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో పాల్గొన్న దాదాపు 200 మంది పైగా అస్వస్థత గురి అయ్యారు. పెళ్లి విందులో పాల్గొన్న వారికి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఎస్.ఆర్.పురం మండల ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థతకు గురైన వారు ఆసుపత్రిలో చికిత్స కోసం బారులు తీరారు. స్థానికుల వివరాలు ప్రకారం పద్మాపురం గ్రామానికి చెందిన కుటుంబంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 500 మందికి పైగా భోజనాలు ఏర్పాటుచేశారు. వీరిలో ఆఖరులో తిన్నవారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు విపరీతంగా కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్య సేవలు
అత్యవసర సేవల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి 35 మందిని తరలించగా, నగిరి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రులకు మరో నలభై మందిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు చిత్తూరు జిల్లా అదనపు ఆరోగ్య శాఖా అధికారి రమేష్ బాబు తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యులు అందరికీ మెరుగైన సేవలు అందిస్తున్నారని, చిత్తూరు నుంచి మరికొందరిని ఎస్.ఆర్.పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిలిపించామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య బృందం అస్వస్థతకు గురైన వారికి వైద్య సేవలు అందిస్తుందన్నారు.