Amaravati Case Supreme Court : అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణలో కీలక పరిణామం - షాకిచ్చిన చీఫ్ జస్టిస్ !
అమరావతి పిటిషన్లపై విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సూచించింది. విచారణకు వచ్చిన సమయంలో నాట్ బిఫోర్ మి అన్నారు సీజేఐ యూయూ లలిత్.
Amaravati Case Supreme Court : అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వేరే బెంచ్ ముందు విచారణకు ఉంచాలని చీఫ్ జస్టిస్ ఉదయ్ లలిత్ ధర్మాసనం ఆదేశించింది. ఈ పటిషన్‌పై విచారణ ప్రారంభమైన తర్వాత.. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్.. నాట్ బిఫోర్ మి అన్నారు. విభజన చట్టంపై గతంలో తన అభిప్రాయం చెప్పానని అందుకే వేరే బెంచ్‌పై విచారణ జరాలన్నారు. వేరే బెంచ్‌పై వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. దీంతో ఈ కేసుల విచారణ వేరే బెంచ్‌కు బదిలీ అవనుంది.
మార్చిలో స్పష్టమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు
అమరావతికి భూములిచ్చిన రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు మార్చి మూడో తేదీన స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని రైతులకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలను ఇచ్చింది. భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఈ అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. హైకోర్టు మూడు రాజధానులు, పాటు సీఆర్డీఏ చట్టం పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.
ఆరు నెలల తర్వాత స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్‌ను ఇవ్వడం శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. చట్టాలు చేయడానికి శాసన వ్యవస్థకు రాజ్యాంగం అన్ని అధికారాలు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలోనూ ప్రభుత్వం చర్చించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. అయితే ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యమయ్యే అవకాశం కనిపించడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. లిస్టయ్యేలా చూసుకున్నారు. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణకు విముఖత చూపడంతో.. మళ్లీ లలిస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు విచారణ జరుగుతుందో తెలుతుంది.
సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ !
సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే ఏపీ ప్రభుత్వం వేగంగా కదిలి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను మార్చడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే మాత్రం ... అమరావతి రైతులకు మరింత భరోసా లభిస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. దీంతో న్యాయవ్యవస్థను లెక్క చేయడం లేదన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.