Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ పోలీసుల తీరు దుర్మార్గం: రామకృష్ణ
Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని.. టీడీపీ అండగా తాము ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టులో సీఐడీ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అలాగే ఇది ఎవరూ ఊహించని ఘటన అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలని, తామంతా టీడీపీకి అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ప్రజా ఉద్యమాలు, ప్రతిపక్ష నేతలపై పోలీసుల దుందుడుకు స్వభావంపై మంగళవారం రోజు విజయవాడలో అఖిలపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. మరోవైపు నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే మకాం వేశారు. చంద్రబాబు బెయిల్ వ్యవహారంపై ఎప్పటికప్పుడు లీగల్ సెల్ తో పాటు సీనియర్ న్యాయవాదులతో చర్చలు నిర్వహిస్తున్నారు. జైలు సూపరింటెండెంట్ నుంచి అనుమతి వస్తే ములాకత్ కు వెళ్లేందుకు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్న సీనియర్ లాయర్
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందని సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణ హాని ఉందని, ఆయనను జైల్లో ఉంచడం సరికాదని కోర్టులో ప్రస్తావించారు. హౌస్ రిమాండ్ అనేది ఇవ్వాలని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనల్లో భాగంగా.. గతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తావించారు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సైతం వాదనలు జరగనున్నాయి. అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. హౌస్ అరెస్ట్ ఇవ్వకూడదని, అలా చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు హౌస్ అరెస్టుకు ఛాన్స్ ఇస్తే కేసు కచ్చితంగా ప్రభావం అవుతుందని, సీఆర్‌సీపీలో హౌస్ అరెస్ట్ అనేది లేదన్నారు. ఇరువైపల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈ అంశంపై న్యాయవాదులను మరింత క్లారిఫికేషన్ కోరింది.
చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ కు ఫిర్యాదు
చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. రెండు రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న భేటీ ఇవాళ జరిగింది. ఈ ఉదయం అపాయింట్‌మెంట్ తీసుకొని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం గవర్నర్‌ను ఈ ఉదయం కలిసింది. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన విషయంతోపాటు శనివారం నుంచి జరిగిన పరిణామాలు వివరించారు. విశాఖలోని పోర్టు గెస్ట్‌హౌస్‌లో టీడీపీ లీడర్లు గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్న.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు.