Chandrababu : పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దూరమైనట్లే - సీనియర్ నేతలకు చంద్రబాబు హెచ్చరికలు !
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న నేతలకు చంద్రబాబు హెచ్చరికలు పంపారు. మీడియా ముందు మాట్లాడితే పార్టీకి దూరమైనట్లేనని స్పష్టం చేశారు.
Chandrababu : తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల కసరత్తు జరుగుతూండటంతో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రియాక్టయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా మీడియాలో పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి నేతలు మీడియాలో చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. గుంటూరు జిల్లాలో నేతలు చేసిన వ్యాఖ్యలను శనివారం ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు దృష్టికి పార్టీ వర్గాలు తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు... పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా, పార్టీకి నష్టం చేసే వారి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్టీ నిర్ణయాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారికి హెచ్చరిక
పార్టీ నిర్ణయాలను తప్పు పడుతూ.. మీడియాలో వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని అధినేత స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఆయా అంశాలపై తమ అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పాలి తప్ప. బహిరంగ చర్చ పెట్టడం మంచిది కాదన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఏ స్థాయి నేతలైనా సహించేది లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను ఇంచార్జ్ గా నియమించారు. దీంతో అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం మీడియాను పిలిచి పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
కోడెల శివరాం, పుల్లారావు వ్యతిరేక వ్యాఖ్యలు
తర్వాత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు ఈ సారి టిక్కెట్ లేదనే ప్రచారం జరుగుతోదంి. భాష్యం ప్రవీణ్ అనే నేతకు కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనెరని..ఆయనకు చిలుకలూరిపేటలో ఓటులేదని మీడియాతో చెప్పుకొచ్చారు. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మీడియాలో హైలెట్ అయింది. దీంతో టీడీపీ అధినేత సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది సీనియర్ నేతలు ప్రజల్లోకి రాలేదు. కేసుల భయంతో రోడ్ల మీదకు రాలేదు. అలాంటి నేతలపై క్యాడర్‌లో వ్యతిరేకత ఉందని.. పార్టీ కోసం కష్టపడిన వారికే టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇప్పటికే సంకేతాలు పంపారని అంటున్నారు .
టిక్కెట్లు ఖరారు చేస్తూండటంతో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలు
ఇప్పుడు టిక్కెట్లు ఖరారు చేసే సమయం దగ్గర పడటంతో సీనియర్ నేతలు మళ్లీ పోటీకి సిద్దమని చెప్పి తెర ముందుకు వస్తున్నారు. చంద్రబాబునాయుడు కొంత మందికి టిక్కెట్ లేదనే సంకేతాలు ఇస్తూండటంతో వారు విమర్శలకు సిద్ధమవుతున్నారు. ముందు ముందు ఇలాంటి సీనియర్లు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో. .. పార్టీ నిర్ణయాలపై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని పట్టించుకోననే సంకేతాలను చంద్రబాబు పంపారని అంటున్నారు.