Adinarayana Reddy : వైసీపీని 151 స్థానాల నుంచి 15కే పరిమితం చేస్తాం- ఆదినారాయణ రెడ్డి
Adi Narayana Reddy: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా నిలబడితే ఆయనకు పోటీగా నిలబడతానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు.
Adi Narayana Reddy: సీఎం జగన్ మోహన్ రెడ్డికి పోటీగా తాను ఎన్నికల్లో నిలబడతానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా నిలబడితే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తనకుందని వ్యాఖ్యలు చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లెల శ్రావణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో యువ సంఘర్షణ యాత్ర జరిగింది. వందల మంది కార్యకర్తలు దానవులపాడు నుంచి ద్విచక్ర వాహనాల్లో పాత బస్టాండ్ లోని గాంధీ కూడలి వరకు ర్యాలీగా వచ్చారు.
151 స్థానాల నుంచి 15కే పరిమితం చేస్తాం
ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ... జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుంపటిగా మారిందని ఆరోపించారు. ఆయన ఇంటికి వెళ్లే సమయం దగ్గర పడిందని పేర్కొన్నారు. వైసీపీ నాయకులను సాగనంపేందుకు వీలైతే ఇతర రాజకీయ పార్టీలను ఏకం చేసి ఇప్పుడున్న 151 నుంచి 15 స్థానాలకే పరిమితం చేస్తామని అన్నారు. దేశం అంతటా భారత రాజ్యాంగం నడుస్తుంటే మన రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని ఆరోపించారు. తనకు సంబంధం లేకున్నా మాజీ మంత్రి వేవేకా హత్య కేసులో నిందితుడిగా ఇరికించేందుకు ప్రయత్నం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు.
మూడేళ్లలోనే మూడు లక్షల కోట్ల అప్పులు
మూడేళ్ల కిందట కన్యతీర్థం వద్ద వైఎస్సార్ పేరిట శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమను గాలికొదిలేశారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని అన్నారు. రాబోయే ఆదాయాన్ని చూపించి మరీ అప్పులు చేసే వాళ్లు ఒక్క ఏపీలోనే చూస్తున్నానని ఆదినారాయణ రెడ్డి అన్నారు. జీవీఎంసీలో ఆస్తులను సైతం కుదవపెట్టి అప్పు తెచ్చుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 3 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. వైసీపీని ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
పాతికేళ్లు వెనక్కి నెట్టారు..
వైసీపీ ఎంపీలకు కేవలం కేసుల పైరవీలతోనే సరిపోతుందని అన్నారు. ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఏం అడుగుతారంటూ ఆది నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం పేరుతో 150 శాతం రేట్లు పెంచారన్నారు. పెట్రో ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. సీఎం జగన్ ఏ ఒక్క రంగాన్ని ఇబ్బంది పెట్టకుండా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనతో ఏపీ పాతికేళ్లు వెనక్కి పోయిందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. రాజధాని విషయంలో మాట మార్చిన జగన్.. అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని అన్నారు.