Satya Kumar: వైసీపీ ఓ పేర్ల పిచ్చి పార్టీ, దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి: సత్యకుమార్
Satya Kumar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంటే పేర్లు మార్చడమేనా అని ప్రశ్నించారు.
Satya Kumar: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా అన్నీ అసత్యాలే చెబుతున్నారని విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్య కుమార్ విమర్శించారు. అసమర్థ పాలనను కప్పి పుచ్చుకునేందుకే సీఎం జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం అవుతుందన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. పాదయాత్రకు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బీజేపీ అని వెల్లడించారు. పాదయాత్రలో రైతులపై దాడికి కుట్ర చేస్తే బీజేపీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా ఎదుర్కొంటారని చెప్పారు.
దోచుకున్నది చాలు దోపిడీ ఆపండి
అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని సత్య కుమార్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని సూటిగా ప్రశ్నలు సంధించారు. కొత్తవి రాక పోగా.. జూట్ మిల్లు, షూగర్ ఫ్యాక్టరీని కూడా మూసి వేయించారని బీజేపీ జాతీయ కార్యదర్శి ఆరోపించారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారని విమర్శలు గుప్పించారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని సత్య కుమార్ ఆరోపణలు చేశారు. మూడున్నరేళ్లు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు బాగా దోచుకున్నారు.. ఇకనైనా దోపిడీ ఆపండి అంటూ సత్య కుమార్ మీడియా మీట్ లో మండి పడ్డారు.
అభివృద్ధి అంటే పేర్లు మార్చడమేనా ?
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ కొత్త నాటకం ఆడుతున్నారని, ఇంత పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదని సత్య కుమార్ ఆరోపించారు. పుట్ట బోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారమేనని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే పేర్లు, ఊర్లు మార్చడమేనా అని సత్య కుమార్ ప్రశ్నించారు.
1986లో ఎన్టీఆర్ వర్సిటీ ఏర్పాటు..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.
ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. మళ్లీ 2006 జనవరి 8న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది. మొత్తానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టింది జగన్ ప్రభుత్వం.