Supreme Court : భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - జప్తు చేసిన ఎఫ్‌డీలను విడుదల చేయవద్దని ఆదేశం !
Bharti Cements : సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఎఫ్‌డీలను విడుదల చేయాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్ీరంకోర్టు పక్కన పెట్టింది.
Bharti Cements case : సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్ ఎఫ్ డీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పబట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భారతీ సిమెంట్స్ కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈడీ వాదనలతో జస్టిస్ అభయ్ ఒఖా నేృతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్ డీలు విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.గత తీర్పును మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు, సుప్రీంకోర్టు సూచించింది.
బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాక ఎఫ్ డీలు జప్తు చేశారని భారతి సిమెంట్స్ న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ జప్తు చేసిందని భారతి సిమెంట్స్ న్యాయవాది ముకుల్ రోహతీ తెలిపారు. ఎఫ్ డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని మరో పిటిషన్ వేసింది భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్ అదనపు పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ అభయ్ ఒఖా ధర్మాసనం ప్రకటించింది. జప్తు చేసిన వాటికి వడ్డీ ఎలా వస్తుందని ప్రశ్నించిన ధర్మాసనం అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు వెల్లడించింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టుకు.. సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను ఈడీ (ED) అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ కోర్టు, హైకోర్టు వ్యతిరేకంగా తీర్పును వెలువరించాయి. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ సవాలు చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో క్విడ్ ప్రో కో జరిగిందని భారతి సిమెంట్స్ పైనా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును ఈడీ చేర్చింది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైంది. ఇప్పటికే ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్, జే.జగన్మోహన్ రెడ్డి, సిలికాన్ బిల్డర్, సండూర్ పవర్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు ఆమె పేరును చేర్చింది. రఘురామ్ సిమెంట్స్ ఒప్పందంలో వైఎస్ భారతి అనే పేరుతో డబ్బు లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది. రఘురామ్(భారతి) సిమెంట్స్‌లో సండూర్ పవర్, కారమేల్ ఏషియా లిమిటెడ్, ఇతర కంపెనీలు హవాలా ద్వారా నిధులను మళ్లించినట్లు ఆరోపించింది. PMLA చట్టం సెక్షన్ 3 కింద నిందితులను ప్రత్యేక కోర్టు శిక్షించాలని ఈడీ కోరింది.
భారతి సిమెంట్స్ తో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో రూ. 750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న అనేక ఆస్తులను గుర్తించి మనీ లాండరింగ్ కేసు కింద సుమారు రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేల కోట్ల పైమాటే. ఇప్పటికే గతంలో నాలుగు విడతలుగా జగన్ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి విడతగా రూ.200 కోట్లు, రెండవ విడతలో రూ.43 కోట్లు, మూడవ విడతలో రూ.225 కోట్లు, నాలుగోసారి రూ.750 కోట్లు అటాచ్ చేసింది.