(Source: ECI/ABP News/ABP Majha)
Ashok Gajapathi Raju: ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమ్మా- పైడితల్లి అమ్మవారికి మొక్కుకున్న అశోక్ గజపతిరాజు
Ashok Gajapathi Raju: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని పూసపాటి అశోక్ గజపతి రాజు సతీసమేతంగా దర్శించుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నట్లు తెలిపారు.
Ashok Gajapathi Raju: మాన్సాస్ ఛైర్మన్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సతీసమేతంగా విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా అశోక్ గజపతి రాజు, ఆయన భార్య సునీతా గజపతిరాజుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అశోక్ గజపతి రాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
"ఆనవాయితీ ప్రకారంగా జరిపించుకుంటే మంచిది. అందరం ఆనందంగా పండుగను జరిపిద్దాం. గుడి చుట్టూ స్థలం తీసుకున్నారు. దాన్ని ఓ ప్లాన్ ప్రకారం నిర్మిస్తే.. ఈ రద్దీ కొంత తగ్గడానికి అవకాశం ఉంటది. వర్షాలు వచ్చినప్పుడు భక్తులకు కొంత సౌకర్యాలు పెంచిన వాళ్లవుతాము. అయితే అది ఎందుకో మరి మూడేేళ్ల నుంచి అలాగే ఉంచేశారు. ఇంకా ముందుకు తీసుకళ్లాలని నా భావన. ఇది భక్తులు ఆ అమ్మవారికి సమర్పించిన నిధుల నుంచి జరిగే విషయం. ఆ నిధుల్ని సద్వినియోగం చేయాలి. దైవ కార్యక్రమాలు వేటిలోనైనా ప్రభుత్వం డబ్బు ఉండదు. భక్తుల డబ్బే. నేను జనరల్ గా దేవుడిని ఏమీ కోరుకోను. కానీ ఇప్పుడు కోరుకున్నాను. తల్లీ మన ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించమని మాత్రమే కోరుకున్నాను. మరి ప్రసాదించిందో లేదో ఆ తల్లికే తెలియాలి. లేదా వారి ప్రవర్తన బట్టి మనమే గుర్తించాలి" - అశోక్ గజపతి రాజు
ఆలయ ధర్మకర్తనైన తననే ప్రభుత్వం డిస్మిస్ చేయడం దారణం అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మావారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకూ ఎందుకు చేయలేదో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ఆలయం అభివృద్ధి చెందితే ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నారు. ఏదైనా సరే తన వల్లే జరుగుతుందన్న భావన పనికిరాదని... అలా అనుకుంటే బుద్ధి తక్కువ పనే అవుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.