Skill Development Case: మళ్లీ హైకోర్టుకు పంపొద్దు, నో యూజ్- చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో కీలక వాదనలు
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా మళ్లీ హైకోర్టుకు పంపిస్తామని సుప్రీంకోర్టు తెలిపారు.
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ వాదించారు. 17ఏ గురించే ఈ రోజు ప్రధానంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా 17ఏ అమల్లోకి వచ్చిన తర్వాతే కేసు నమోదైందని సాల్వే వాదించగా.. అంతకుముందే నమోదైందని ముకుల్ రోహిత్గీ వాదించారు. దీంతో జూలై 5, 2018 డాక్యుమెంట్ హైకోర్టు ముందే ఉంది కాబట్టి అక్కడకి పంపుదామని జస్టిస్ త్రివేది పేర్కొనగా.. అది మాకు ఏ రకంగానూ ఉపయోగం లేదని, నేరం జరిగిన తేదీనే ముఖ్యమనే వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఉన్నప్పుడు తీర్పులో మార్పు ఏం లేదని సాల్వే తెలిపారు.
మళ్లీ హైకోర్టుకు వద్దని, దీని వల్ల ఉపయోగం ఏమీ ఉండదని సాల్వే అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రిమాండ్ ఆర్డర్‌ను సాల్వే చదివి వినిపించారు. 2021లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసును నమోదు చేసినట్లు అందులో స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. హైకోర్టులో సెప్టెంబర్ 19న తాము వాదనలు వినిపించిన తర్వాత తీర్పును హైకోర్టు రిజర్వు చేసిందని, హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డాక్యమెంట్లను ప్రవేశపెట్టిందని సాల్వే వాదించారు. 17-ఎ వర్తింపుపై సాల్వే 1959 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఊటంకించారు. చట్టాన్ని అమలు పరిచే విధానంలో మార్పు జరిగినప్పుడు.. అది ఆ తర్వాత అన్నింటికీ వర్తిస్తుందని గుర్తు చేశారు.
'2018కి ముందు చేసిన ఎంక్వైరీ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. అంతకుముందు చేసిన విచారణను అప్పుడే ముగించేశారు. రిమాండ్ కోర్టు ఎక్కడా రికార్డు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్‌కు ఎలాంటి విలువ లేదు. ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్, ఈ విచారణ ఆధారంగా చేసినట్లైతే దానికి విలువ ఉంటుంది. 17-ఎ వర్తింపుపై కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆఫరేషన్ ప్రొసీజర్ ఇచ్చింది. ప్రతీ సందర్భంలోనూ అనుమతి తీసుకోవాల్సిందే. ఒకవేళ ముందుగానే ఫిర్యాదు ఉన్నప్పటికీ.. అది లెక్కలోకి రాదని.. 17-ఎ నేరం జరిగిన తేదీకి వర్తించదని రిమాండ్ రిపోర్టులోనే పేర్కొన్నారు. 17-ఎను నేరం జరిగిన తేదీకా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీకి వర్తింపచేయాలా? అన్న దానిపై వివిధ హైకోర్టుల్లో వివిధ రకాలైన తీర్పులున్నాయి. మనం ఇక్కడ చూడాల్సింది అవినితి నిరోధక కేసులు. ఈ కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తుంది కాబట్టి 17-ఎ అమలైతే కనుక.. ఇక ఆ పైన ఉన్నవి ఏవీ వర్తించవు. ఇటీవల పంకజ్ బన్సల్ కేసు విషయంలో ఆయన ఆరెస్టు అక్రమమని గుర్తించిన తర్వాత రిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అరెస్టు అక్రమం అయినప్పుడు రిమాండ్ కూడా అంతే' అని సాల్వే వాదించారు.
'ఏదేమైనా నేరం జరిగిన తేదీనే ముఖ్యమనే ఆలోచనతోనే హైకోర్టు ఉంది కాబట్టి నేను మళ్లీ అక్కడికి వెళ్లే తలబాదుకోవాలి. రాజకీయంగా వేధింపులకు గురిచేస్తారనే ఉద్దేశంతోనే 17-ఎ సవరణ తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని అమలు చేయడంలో అనుసరించాల్సిన విధి విధానాలను కేంద్రం రాష్ట్రాలకు సెప్టెంబర్ 3, 2021నే పంపింది. దాని ప్రకారం వివిధ దశల్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అరెస్టుకే కాదు. విచారణ ప్రారంభించడానికి ముందు కూడా అనుమతి తీసుకోవాలి. SOP (Standard Operation procedure)లో స్పష్టంగా విచారణ ఒక దశనుంచి ఇంకో దశకు వెళ్లేప్పుడు కూడా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. సెప్టెంబర్ 8, 2023న చంద్రబాబును A-37గా చేర్చారు. కానీ అంతకు ముందే విచారణ అధికారులు దీనిపై గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాలి. 17-ఎ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి దాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇది నేరానికి సంబంధించింది కాదు. వ్యక్తికి సంబంధించినదే. దీని ప్రకారం సమాచారం సేకరించడానికి.. విచారణకు.. పోలీసుల ఆధారాల అన్వేషణకు ప్రతీ దశలోనూ అనుమతి తీసుకోవాల్సిందే. మొదటి దశలో తీసుకున్నా.. ఇన్విస్టిగేషన్‌కు మళ్లీ అనుమతి పొందాలి. 17-ఎ అనేది నేరం జరిగిందా? లేదా? అని నిర్థారించడానికి కాదు. నేరారోపణలతో ఒక వ్యక్తిని హింసించడానికి.. విచారణ పేరుతో వేధించడాన్ని నిరోధించడానికే దీనిని ఉద్దేశించారు' అని సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.