Janasena Campaign Arrangements : పవన్ ప్రచారానికి జనసేన సన్నాహాలు - కమిటీలు ఏర్పాట్లు !
Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసేందుకు ఏరియాల వారీగా కమిటీలు ప్రకటించారు. త్వరలో పవన్ ప్రచార బరిలోకి దిగే అవకాశం ఉంది.
Janasena Campaign Arrangements : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం ప్రాంతాల వారీగా కమిటీ్ని నియమించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు . ప్రతీ జోన్ లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి సమన్వయంతో నిర్వహించేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
జనసేన పార్టీ 2024 ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జోనల్ కమిటీలు pic.twitter.com/xc4giOYD7a
— JanaSena Party (@JanaSenaParty) January 20, 2024
పవన్ కల్యాణ్ ప్రచారానికి ప్రభుత్వం ఆటంకాలు కల్పించే అవకాశం ఉంది. అందుకే ప్రతీ ఏరియాకు ముందస్తుగానే అనుమతులు ఇతర న్యాయపరమైన ప్రక్రియ కోసం ప్రత్యేకంగా లాయర్ల టీంను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరిగినా తక్షణ వైద్య సాయం కోసం వైద్య బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఇంతకు ముందే వారాహి యాత్రను ప్రారంభించారు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, కృష్ణా జిల్లాలో పూర్తి చేశారు. తర్వాత రాజకీయ పరిణామాలతో గ్యాప్ ఇచ్చారు. ఎన్నికల సన్నాహాలు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆ సన్నాహాలు తుది దశకు రావడంతో ఎన్నికల ప్రచార బరిలోకి దిగాలనుకుంటున్నారు. టీడీపీతో పొత్తు కూడా ఖరారైంది. ఎన్ని సీట్లు ఇస్తారన్నదానిపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అభ్యర్థులపైనా పవన్ ఒక్క సారే అంచనాకు వస్తున్నారని చెబుతున్నారు. టీడీపీతో కలిసి కొన్ని ఉమ్మడి బహిరంగసభలను కూడా నిర్వహించబోతున్నారు.
సింగనమలలో బండారు శ్రావణికి లైన్ క్లియర్! లోకేష్‌తో భేటీలో ఏం జరిగింది?
ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా రెండు పార్టీల అభ్యర్థుల కోసం పవన్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ఒకటి రెండు నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి పదో తేదీన వచ్చింది. ఈ సారి కూడా అంత కన్నా ముందే వస్తుంది కానీ ఆలస్యమయ్యే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత త్వరగా ప్రచార బరిలోకి దిగితే అంత మంచిదని అనుకుంటున్నారు.