Ugadi 2022 : తెలుగు వారందరికీ ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు
Ugadi 2022 : తెలుగు వారందరికీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Ugadi 2022 : తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలు చేకూరుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ సుభీక్షంగా అలరారుతున్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభిస్తారని గుర్తు చేశారు. సాగునీరు, వ్యవసాయ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నదన్నారు. రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
సీఎం జగన్ శుభాకాంక్షలు
తెలుగువారికి శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని పంటలు బాగా పండి రైతులకు మేలు జరగాలని కోరుకున్నారు. అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. ఉగాది సందర్భంగా శనివారం తాడేపల్లిలో జరిగే వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొననున్నారు. రేపు ఉదయం గం.10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం ఇప్పటికే గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారు తొలి పండుగగా భావించే ఉగాది ప్రజలకు సకల శుభాలు కలిగించాలని ఆకాంక్షించారు. శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని కష్టాలు తొలగి ప్రజలు సంతోషంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. పాలకుల పాపాలతో, పెరిగిన ధరలు, పంట నష్టాలతో ఈ ఏడాది తీవ్ర కష్టాలు పడిన రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకున్నారు. చేదు మాత్రమే మిగిలిన సామాన్యుల జీవితాలకు తీపి తోడవ్వాలని చంద్రబాబు అన్నారు.
శ్రీ శుభకృత్ శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #Ugadi2022#Shubhakruth pic.twitter.com/qoDzIGUt7e
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2022
జనసేనాని పవన్ కల్యాణ్
తెలుగు వారికి శుభకృత్ నామ సంవత్సవరం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పంటలు పుష్కలంగా పండి రైతులు, వ్యాపారాలు బాగా జరిగి వ్యాపారస్థులు, కార్మికులు, అన్ని వృత్తుల వారు సుఖసంపదలతో విరాజిల్లాలని కోరుకున్నారు.